ఇప్పటి వరకూ బి.1.617.2 అనే రకం కరోనా వేరియంట్ భారత్ లో తీవ్ర అలజడి సృష్టించింది. భారత్ పై దీని ప్రభావం తగ్గుతున్న దశలో బ్రిటన్ లో ఎక్కువగా ఈ రకం కేసులు పెరిగిపోతున్నాయి. డెల్టా వేరియంట్ గా పిలుస్తున్న ఈ వైరస్ వల్ల సెకండ్ వేవ్ లో తీరని నష్టం జరిగింది. డెల్టాతోటే ఇంత ఉత్పాతం జరిగితే, ఇక డెల్టా ప్లస్ ఇంకెంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవును, ఇపుడు కరోనా వైరస్ లో కొత్త వేరియంట్ ని కనిపెట్టారు. దాని పేరు డెల్టా ప్లస్.

డెల్టా వైరస్ లో కె417 అనే ఉత్పరివర్తనం కారణంగా కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ గా అది రూపాంతరం చెందింది. ప్రస్తుతానికి భారత్ లో డెల్టా ప్లస్ ఉనికి బాగా తక్కువగా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని బి.1.617.2.1 గా కూడా పిలుస్తున్నారు. స్పైక్ ప్రొటీన్ వల్ల ఈ ఉత్పరివర్తనం వచ్చినట్టు అనుమానాలున్నాయి. మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు ఈ స్పైక్ ప్రొటీన్ నే వైరస్ ఉపయోగించుకుంటున్నట్టు తెలిసింది. ఈమేరకు ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 62మందిలో ఈ డెల్టా ప్లస్ వైరస్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. భారత్ కి చెందిన 7 నమూనాల్లో ఇది కనిపించిందని 'పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్' సంస్థ ప్రకటించింది. భారత్ లో ఇది తక్కువగా కనిపించినా.. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఎక్కువగా వెలుగు చూసిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే డెల్టా ప్లస్ పై ఎక్కువ భయాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతం డెల్టా వేరియంట్ తో వచ్చిన యాంటీబాడీలు ఈ డెల్టా ప్లస్ ని ఎదుర్కొంటాయో లేదో తేలాల్సి ఉంది.

ప్రస్తుతం డెల్టా వేరియంట్ భారత్ లో తగ్గుముఖం పట్టింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా డెల్టా వేరియంట్ కొన్ని సందర్భాల్లో, కొంతమందిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు డెల్టా ప్లస్ ప్రభావం వ్యాక్సిన్ తీసుకున్నవారిపై ఎంతవరకు ఉంటుందనేది తేలాల్సి ఉంది. దీనితోపాటు సహజంగా కరోనా రోగ గ్రస్తుల్లో ఉత్పన్నమైన యాంటీబాడీలు డెల్టా ప్లస్ ని అడ్డుకుంటాయో లేదో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: