ఏపీ సీఎం జగన్.. తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పక్కాగా షెడ్యూల్ ఫాలో అవుతున్నారు. కరోనా సంక్షోభం.. ఇతర ఆర్థిక పరిస్థితులు దాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఇస్తామన్నవి.. ఇస్తామంతే.. ఆరు నూరైనా సంక్షేమం ఆగదు అన్న తరహాలో జగన్ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయం విడుదల చేయనున్నారు.

ఈ వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర  పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించబోతున్నారు. సీఎం జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా  లబ్ది దారుల ఖాతాల్లో  10 వేల రూపాయల నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది సుమారు  రెండున్న ర లక్షల మంది డ్రైవర్లకు ఈ సాయం అందించనున్నారు. ఈ మొత్తం రూ.250 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. దళారులు లేకుండా నేరుగా  లబ్ధిదారుల ఖాతాల్లోకే  రూ.10 వేలు నగదు జమ చేయబోతున్నారు.

అయితే ఇలాంటి సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించడం వెనుక రాజకీయ వ్యూహం లేకపోలేదు. బడుగు, బలహీన వర్గాల ఓటు బ్యాంకు పదిలం చేసుకుంటే  మళ్లీ అధికారం అందుకోవడం ఖాయం అన్నది జగన్ వ్యూహంగా ఉంది. అందుకే ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నా.. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలకు నిధులు ఆగకుండా  జాగ్రత్తపడుతున్నారు. పాత  పథకాలే కాదు..  పేదల కోసం కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి.. అనే అంశాల కంటే.. పేదల పథకాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయా లేదా అన్నదే జగన్ సర్కారు ప్రాధమ్యంగా ఉంది. ఇటీవలే జగన్ సర్కారు  వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల గృహనిర్మాణం  కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా రూ.28,084 కోట్లతో మొదటి దశలో 15.60 లక్షల పక్కా ఇళ్లు నిర్మించబోతున్నారు. జనం మనసు గెలవడంలో ఒక్కొక్కరి వ్యూహం ఒక్కోలా ఉంటుంది. జగన్‌ది మాత్రం సంక్షేమ బాటే.

మరింత సమాచారం తెలుసుకోండి: