కరోనా సెకండ్‌ వేవ్‌లో చాలా భయపెడుతోంది. ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చినా చాలా మందిలో పెద్దగా లక్షణాలు కూడా చూపించకుండానే వెళ్లిపోయింది. కానీ.. సెకండ్ వేవ్‌లో అలా కాదు.. ఈసారి గతం కంటే మరణాల రేటు పెరిగింది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగింది. చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇంకొందరు ఆక్సిజన్ కోసం ఇబ్బంది ప‌డ్డారు. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క ఇబ్బంది పడ్డారు. కానీ.. ఇప్పుడు కాస్త పరిస్థితి మెరుగైంది.

అయితే చాలా మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. కోలుకున్న తర్వాత హమ్మయ్య కరోనాను జయించామని సంతోషపడుతున్నారు. మంచిదే.. కానీ.. కరోనా నెగిటివ్ వచ్చినంత మాత్రాన మీరు సేఫ్ అని భావించడానికి వీల్లేదంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వస్తే ఓ రెండు వారాలు ఇబ్బంది పెడుతుంది.. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మామూలు స్థాయికి వచ్చేస్తుంది అనేది ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయం.. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో 80 శాతం వరకూ కరోనా అనంతర ఇబ్బందులతో బాధ పడుతున్నారు. నిస్సత్తువ, ఆయాసం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఛాతీ నొప్పి, జుట్టు రాలడం, విరేచనాలు, వాసన లేకపోవడం వంటి సమస్యలు కరోనా అనంతరం కూడా కొనసాగుతున్నాయట. సాధారణంగా ఈ లక్షణాలు కొద్ది లక్షణాలతో కరోనాను జయించిన వారిలో కాకుండా ఆసుపత్రి పాలయినా వారిలో కనిపిస్తున్నాయట.
 
మొదట్లోనే కరోనా లక్షణాలు ఎక్కువ కనిపించిన వారికి.. కరోనా తీవ్రమై ఆసుపత్రుల్లో చేరిన వారికి.. ఆక్సీజన్ పెట్టడం ద్వారా కరోనా నుంచి బయటపడిన వారికి ఈ కరోనా అనంతర ఇబ్బందుల ముప్పు ఎక్కువగా ఉంటోందట. అందుకే కరోనాను జయించాం కదా అని అక్కడితో ఆగిపోకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. శరీరంలో మార్పులు గమనించండి. ఇబ్బందులు వుంటే వైద్యులను సంప్రదించండి. కరోనా అనంతర ఇబ్బందుల గురించి పూర్తిగా అవగాహన పెంచుకోండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: