తోట త్రిమూర్తులు....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. 1994లో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీలోకి వెళ్ళిన తోట, 1999లో మరోసారి గెలిచారు. 2004లో ఓడిపోయిన తోట తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009లో ఓడిపోయారు. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో 2012 రామచంద్రాపురం ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఇక 2014లో టీడీపీలోకి వచ్చి పోటీ చేసి గెలిచారు. 2019లో అదే టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, వైసీపీలోకి జంప్ కొట్టేశారు. ఇన్నిసార్లు పార్టీలు మారుతూ వచ్చిన తోటకు తూర్పు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉంది. అందుకే ఆయనకు మండపేట వైసీపీ బాధ్యతలు అప్పగించారు జగన్. ఇక మండపేటలో టీడీపీ బలాన్ని తగ్గించడమే లక్ష్యంగా తోట పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి మంచి విజయాలు అందించారు.

ఇలా వైసీపీకి మంచి విజయాలు అందించిన తోటకు జగన్ ఎమ్మెల్సీ పదవి సైతం ఇచ్చారు. గవర్నర్ కోటాలో నలుగురుకి పదవులు ఇచ్చారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్, లేళ్ళ అప్పిరెడ్డిలకు ఎమ్మెల్సీలు దక్కాయి. ఇందులో మోషేన్ రాజు మినహా మిగతా ముగ్గురుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాంటివారికి ఎమ్మెల్సీలు ఎలా ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తుంది. అయితే రమేష్, అప్పిరెడ్డిల కంటే టీడీపీ తోటనే ఎక్కువ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

టీడీపీని వీడి వైసీపీలో కీలకంగా మారిన తోటకు చెక్ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన టార్గెట్‌గా రాజకీయం నడుస్తున్నట్లు కనబడుతుంది. గతంలో దళితులపై దాడి చేశారని తోటపై కేసు నమోదైంది. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో ఉంది. ఇదేగాక పలు కేసులు తోటపై ఉన్నాయి. అందుకే తోటకు పదవి ఎలా ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తుంది. ఇదే సమయంలో మొన్నటివరకు తోట టీడీపీలోనే పని చేసి వచ్చారు. ఇక అప్పుడు తోట నేర చరిత్ర టీడీపీ వాళ్ళకు గుర్తు రాలేదా? అని పలువురు వైసీపీ అనుకూల విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలా జరిగిన తోటకు మాత్రం ఎమ్మెల్సీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: