మాజీ ఎంపీ, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌.. కొన‌క‌ళ్ల నారాయ‌ణ  ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు?  ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే టీడీపీ నేత‌ల మ‌ధ్య జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ పుంజుకునేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తార‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు.. ఆయ‌నకు పార్ల‌మెంట‌రీ ఇంచార్జ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున కొన‌క‌ళ్ల యాక్టివ్ పార్టిసిపేష‌న్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గ‌త నెల‌లో పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి జ‌రిగింది. అయితే.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిం చాల‌ని.. అయితే.. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని .. చంద్రబాబు నుంచి ఆదేశాలు వ‌చ్చాయి. దీంతో జిల్లాలో ఘ‌నంగానే చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఎక్క‌డా పెద్ద‌గా ఊపు లేకుండానే ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌మ అనిపించారు. ఇక‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌పైనా.. మాజీ మంత్రి దేవినేని ఉమా పైనా.. ఇటీవ‌ల పోలీసులు మ‌రోసారి కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు. పార్టీ అధిష్టానం వెంట‌నే స్పందించి విమ‌ర్శ‌లు చేసే స‌రికి వెన‌క్కి త‌గ్గారు.

ఈ విష‌యాల‌పై గ‌ళం విప్పాల్సిన కొన‌క‌ళ్ల క‌నీసం మీడియాముందుకు కూడా రాలేదు. ప్ర‌భుత్వ విధానాల‌ను ఒక‌వైపు చంద్రబాబు విమ‌ర్శిస్తుంటే.. మరోవైపు నాయ‌కులు నిద్ర‌పోతున్నార‌న‌డానికి కొన‌క‌ళ్ల ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా ఉన్నార‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. నేత‌లు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అవనిగడ్డ, పామర్రు, పెడన, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీ వీక్ గా ఉంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి(మ‌చిలీప‌ట్నం ప‌రిధిలో) నేత‌ల‌కు ధైర్యం చెప్పాల్సిన పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయ‌ణ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న పుంజుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: