వైఎస్ జగన్ రెండేళ్ళ పాలన పూర్తి చేశారు. ఆయన అటు రాజకీయంగానూ రాటు తేలారు. మరో వైపు చూస్తే చంద్రబాబు లాంటి చాణక్యుడు విపక్షంలో ఉన్నారు. దాంతో జగన్ కూడా తగిన విధంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

జగన్ పాలన ఒక వైపు సజావుగా చేస్తూనే మరో వైపు 2024 ఎన్నికల మీద దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అన్నది జగన్ అజెండాగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. దక్షిణ కోస్తాలో వైసీపీకి పట్టుంది. దాంతో ఉత్తర కోస్తా మీదనే ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

చంద్రబాబుని 2014 ఎన్నికల్లో గెలిపించినవి ఉత్తర కోస్తా జిల్లాలే. ఇవే జిల్లాలు 2019 ఎన్నికల్లో జగన్ వైపు టర్న్ అయ్యాయి. ఇపుడు ఈ జిల్లాలను పోగొట్టుకోకూడదని, అపుడే బంపర్ విక్టరీ మరోమారు  సాధ్యమని జగన్ తలపోస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద ఆయన చూపు ఉంది. అక్కడ పార్టీకి రేపటి ఎన్నికల్లో పనికి వచ్చేవారు ఎవరో ఆయన గుర్తించి మరీ పెద్ద పీట వేస్తున్నారు.

నిజానికి తోట త్రిమూర్తులు అనేకమైన పార్టీలు మారి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా అభ్యంతరం పెట్టేవారు ఉండరు. కానీ జగన్ ఆయన కావాలని పట్టు బట్టి మరీ గవర్నర్ కోటాలో మాట   నెగ్గించుకున్నారు. దానికి కారణం కాపు వర్గాలలో తోటకు మంచి పేరుంది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లాలో పటిష్టమైన నాయకత్వం ఉంది. దాంతో ఆయనను జగన్ ముందు పెట్టి గోదావరి రాజకీయాన్ని నడిపించాలని చూస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే అక్కడ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. ఇపుడు తోట త్రిమూర్తులుని కూడా పెద్ద మనిషిని చేసి అధికార హోదాను ఇచ్చేశారు. దీంతో కాపుల పట్టు జారకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపటి రోజుల ఏపీలో ఏ కూటములు వచ్చినా మరే సామాజిక సమీకరణలు మారినా కూడా వైసీపీ బలం చెక్కుచెదరకూడదనే జగన్ గోదావరి జిల్లాల మీద ఇప్పటి నుంచే గురి పెట్టారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: