ఏపీలో జనసేన బలం ఎంత? అంటే అబ్బే జనసేనకు పెద్ద బలం ఎక్కడ ఉంది...అసలు ఆ పార్టీకి 5 శాతం మించి ప్రజల మద్ధతు లేదనే గట్టిగా చెప్పేయొచ్చు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో గానీ, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లోగానీ జనసేన బలం ఎంతో తేలిపోయింది. అయితే తెలుగు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్‌కు రాజకీయాల్లో పెద్ద బలం లేదని అర్ధమవుతుంది.


అయితే పవన్ ఆ బలాన్ని పెంచుకునే పనులు చేస్తున్నారా అంటే..గత రెండేళ్ళు నుంచి ఏపీలో జనసేనని బలోపేతం చేసే కార్యక్రమం పెద్దగా చేయలేదు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారుగానీ, రాజకీయాలని మాత్రం లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకుని సేఫ్‌గా రాజకీయం నడిపించేస్తున్నారు తప్ప, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేద్దామనే ఆలోచనే చేయడం లేదు.


కనీసం జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో అయిన సరిగ్గా వర్క్ చేయడం లేదు. గత ఎన్నికల్లో జనసేన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో బాగానే ప్రభావం చూపింది. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొంతవరకు ఓట్లు తెచ్చుకుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్వాలేదనిపించింది. ఇక రాయలసీమలో పూర్తిగా తేలిపోయింది. అయితే వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలి. కానీ పవన్ కాస్త బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పార్టీని పైకి లేపే కార్యక్రమాలు చేయడం లేదు.


కనీసం ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలపై ఫోకస్ పెడితే కొంతవరకు జనసేనకు ఓటింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు అయిన గెలుచుకోగలుగుతారు. కానీ పవన్ అలాంటి పని ఏం చేయడం లేదు. అసలు మొత్తానికి పార్టీనే పట్టించుకోవడం లేదు. అసలు 175 నియోజకవర్గాలకు పార్టీ తరుపున ఇన్‌చార్జ్‌లు సరిగ్గా లేరు. మరి దీని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జనసేన ఒకటి, రెండు సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: