చిత్తూరు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈ స్థానం నుంచి టీడీపీ 7 సార్లు విజయం సాధించింది. పార్లమెంట్ పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ఇందులో కుప్పం ఉండటం వల్ల ఎక్కువసార్లు చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలుస్తూ వచ్చింది.


మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటకపోయిన సరే కుప్పంలో చంద్రబాబు పోటీలో ఉండటం వల్ల, అక్కడ టీడీపీకి భారీ మెజారిటీ వచ్చేది. ఇక ఈ మెజారిటీనే చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలవడానికి ఉపయోగపడేది. 2009, 2014 ఎన్నికల్లో ఇలాంటి పరిస్తితే ఉంది. కుప్పంలో టీడీపీకి వచ్చిన మెజారిటీ వలనే చిత్తూరు పార్లమెంట్‌లో శివప్రసాద్ విజయం సాధిస్తూ వచ్చారు.


అయితే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గింది. అదే సమయంలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఫలితంగా శివప్రసాద్ ఓడిపోయారు. ఇక ఓడిపోయిన కొన్ని నెలలకే శివప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. శివప్రసాద్ చనిపోవడంతో చిత్తూరులో టీడీపీకి ఇన్‌చార్జ్ లేకుండా పోయారు. ఇక చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా పులివర్తి నాని పనిచేస్తున్నారు.


పులివర్తి చంద్రగిరి అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దీంతో చిత్తూరు పార్లమెంట్‌కు ఇన్‌చార్జ్‌ని నియమించాలసిన అవసరముంది. ఇక చిత్తూరు పార్లమెంట్ స్థానానికి రావడానికి శివప్రసాద్ అల్లుడు నరసింహాప్రసాద్ చూస్తున్నారు. గత ఎన్నికల్లో నరసింహ రైల్వేకోడూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయనని ఢీకొట్టడం నరసింహ వల్ల కాదు.


అందుకే నరసింహ చిత్తూరుకు వచ్చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఎలాగో చిత్తూరు పార్లమెంట్‌కు ఇన్‌చార్జ్ లేరు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్‌లో పోటీ చేయాలని నరసింహ చూస్తున్నారు. ఇక్కడైతే కనీసం కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీతో బండి లాగించేయవచ్చని నరసింహ భావిస్తున్నారు. మొత్తానికైతే నరసింహ చిత్తూరు రావడానికి ఫిక్స్ అయిపోయారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: