టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గుంటూరు జిల్లా మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గాన్నే ఎంచుకున్న విష‌యం తెలిసిందే. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న తొలిసారి క్రియా శీల రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. ఇక్క‌డ విజ‌యం గ్యారెంటీ అనుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి కూడా ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. పోటీ కూడా ట‌ఫ్‌గా ఉంటుంద‌ని భావించారు. కానీ, ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వైసీపీ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి 2014 ఎన్నిక‌ల కంటే ఎక్కువ ఓట్ల‌తో విజ‌యం ద‌క్కించుకున్నారు.


దీనిపై స్పందించిన లోకేష్‌.. అప్ప‌ట్లోనే ఒక మాట చెప్పారు. తాను మ‌ళ్లీ మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తాన‌ని.. విజ‌యం ద‌క్కించుకుని తీరుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తార‌ని స్ప‌ష్ట‌మైంది. పోటీ చేస్తారు స‌రే.. కానీ.. మంగ‌ళ‌గిరి నుంచి గెల‌వాలంటే.. మాత్రం ముఖ్యంగా మూడు సూత్రాలు పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది స్థానికంగా నేత‌లు చెబుతున్న మాట‌. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి  విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణంగా ఉన్న ఈ మూడు సూత్రాల‌ను లోకేష్ కూడా అమ‌లు చేస్తే.. విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.


1. రైతుల‌తో మ‌మేకం కావడం :  ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇక్క‌డి రైతుల‌తో మ‌మేకం అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ప‌రిష్కారానికి త‌న‌వంతుగా కృషి చేస్తున్నారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు లోకేష్ అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది టీడీపీ నేత‌ల మాట‌. ఆళ్ల క‌న్నా ఒక అడుగు ఎక్కువ‌గా లోకేష్ రైతుల‌కు చేరువ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.


2. రూ.4 క్యాంటిన్‌:  మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆళ్ల 4 రూపాయ‌ల‌కే భోజ‌నం అందించే క్యాంటిన్‌ను న‌డుపుతున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఉద‌యం 10గంట‌ల‌కే ఈ మొబైల్ క్యాంటిన్లు తిరుగుతున్నాయి. దీంతో పేద‌ల, కార్మికుల ఆక‌లి తీరుతోంది. ఇది ఎన్నిక‌ల్లో ఆళ్ల‌కు ప్ల‌స్ అయింది. ఇప్పుడు దీనికి మించి లోకేష్ ఏమైనా చేయాల‌నేది టీడీపీ నేత‌ల మాట‌.


3. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం:  మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల‌కు ఇదో పెద్ద సౌల‌భ్యం. ఎమ్మెల్యేను క‌ల‌వాలంటే.. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రిసాయాన్ని కోర‌రు. నేరుగా ఆయ‌న ఇంటికి వెళ్లిపోవ‌చ్చు. త‌మ స‌మ‌స్య ఎలాంటిదైనా.. ఎమ్మెల్యేతో చెప్పుకోవ‌చ్చు. ఇక‌, ఆళ్ల కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌జ‌ల‌కు క‌లిసి వ‌చ్చింది. ఇలానే నారా లోకేష్ కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. క‌నీసం వారంలో మూడు రోజులు అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటే.. వారి స‌మ‌స్య‌లు వింటే.. మంచిద‌ని సూచిస్తున్నారు. ఈ మూడు సూత్రాల‌ను పాటిస్తే.. లోకేష్ విజ‌యం త‌థ్య‌మ‌ని చెబుతున్నారు. మ‌రి లోకేష్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: