తెలంగాణలో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈటెల రాజేందర్ బాటలో మరికొంతమంది అసంతృప్త నేతలు పయనించే అవకాశం ఉందని బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు ఈటెల బాటలో పయనిస్తున్నారు అని అంటున్నారు. గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని తుమ్మల నాగేశ్వరరావు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.. 


ఈ నేపథ్యంలోనే బీజేపీనే టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్న ఆయన బీజేపీ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన సన్నిహితులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారని ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ప్రస్తుతం జిల్లా పార్టీలో మూడు వర్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం కాగా మరొకటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం అలాగే మరో వర్గం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించిన వర్గం.  


ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఇక తనకు ఇక్కడ సరిపడదని భావిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలకి ఇప్పటికే చూచాయగా సూచనలు చేశారని వీలైనంత త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఆయన గతంలోనే పార్టీ మారతారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఇండియా హెరాల్డ్ ఆ వార్తని నివేదించడంతో ఆయన స్వయంగా ప్రెస్మీట్ పెట్టి మరీ పార్టీ మారడం లేదని కుండబద్దలు కొట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయ్ అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: