ఏపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. గ‌తంలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు, మార్పు తెస్తాను.. అంటూ.. ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌ల వ్య‌వ‌హార శైలి ఒకే విధంగా ఉంద‌ని .. రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదంతా ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించిన త‌ర్వాత వ‌స్తున్న విశ్లేష‌ణ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంత‌గా .. అంటే గ‌తంలో చంద్ర‌బాబు, ఇప్పుడు జ‌గ‌న్ చేసిన‌న్ని ప‌ర్య‌ట‌న‌లు ఢిల్లీకి చేయ‌లేదు. కేంద్ర పెద్ద‌ల చుట్టూ ఇన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌లేదు.

గ‌తంలో చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పుకొన్నా.. నేను 20 సార్లు అప్పాయింట్‌మెంట్ అడిగితే.. ప్ర‌ధాని మోడీ ఒక్క‌సారి కూడా ఇవ్వ‌లేదు.. అని. అంటే.. దీనికి ముందు ఎన్నిసార్లు ఆయ‌న ఢిల్లీకి వెళ్లారో లెక్క‌లేదు. ఇక‌, ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా గ‌డిచిన రెండేళ్ల‌లో చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారు. అయితే.. ఇలా ఇద్ద‌రు నేత‌లు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ఏం చేశారు ? అనేది కీల‌కం. ఏ సీఎం అయినా..కేంద్రం వ‌ద్ద‌కు వెళ్తే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కే ప‌రిమితం కావాలి. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు తామిచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు క‌ట్టుబ‌డి ఉండాలి.

కానీ, ఏపీ నుంచి గతంలో చంద్ర‌బాబు ప‌లుమార్లు ఢిల్లీ టూర్ చేసినా.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ వెళ్లి వ‌స్తున్నా.. అది వారి వ్య‌క్తిగ‌త అజెండాగానే ఉంద‌ని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు.. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. అప్ప‌టి విప‌క్ష నేత జ‌గ‌న్‌ను ఇర‌కాటంలోకి నెట్టేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఆయ‌న బెయిల్ ర‌ద్దు లేదా సీబీఐ కేసుల‌ను మ‌రింత స్పీడ్ పెంచాల‌ని కోరార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. లేక‌పోయి ఉంటే.. ప్ర‌త్యేక హోదాపై ప‌ట్టుబ‌ట్టిన దాఖ‌లాలు మ‌న‌కు ఎన్నిక‌ల‌కు ముందు నాలుగేళ్లు ఎక్క‌డా క‌నిపించ‌వు.

దీంతో చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ కేవ‌లం జ‌గ‌న్ కోస‌మే అన్న‌ట్టుగా సాగింది. ఇక‌, ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఢిల్లీ టూర్ కూడా ఇదేవిధంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్ట‌డం లేదా.. త‌మ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌రాజు దూకుడుకు అడ్డుక‌ట్ట వేసుకునేలా కేంద్రంలోని పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకే ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లేక‌పోయి ఉంటే.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు హోదా, పోల‌వ‌రం స‌హా .. అన్ని హామీలు అలానే ఉండిపోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: