గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. అయితే జనసేన ఎన్నికల్లో ఏం ప్రభావం చూపకపోయిన, టీడీపీ మీద మాత్రం బాగా ఎఫెక్ట్ చూపించింది.

జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి పెద్ద డ్యామేజ్ చేసింది. అది వైసీపీకి బాగా అడ్వాంటేజ్ అయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో టీడీపీపై జనసేన ప్రభావం బాగా పడింది. ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం జనసేన దెబ్బ టీడీపీకి తగిలింది. అదే వైసీపీకి ప్లస్ అయింది. అయితే ఈ సారి మాత్రం అలా జరగకుండా ఉండాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.


నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్ధతు తీసుకుంటేనే బెటర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ పవన్ మళ్ళీ వేరుగా పోటీ చేస్తే డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు. అదే కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని తమ్ముళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే ఆ జిల్లాల్లో టీడీపీ ఎక్కువగా సీట్లు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో విడిపోవడం వల్ల, ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది.

చాలాచోట్ల జనసేనకు పడిన ఓట్ల కంటే టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీలు తక్కువ. అలా కాకుండా మొన్న ఎన్నికల్లోనే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే, గెలిచి అధికారంలోకి రాకపోయిన కనీసం 50-60 సీట్లు గెలుచుకునే వాళ్ళమని తమ్ముళ్ళు చెబుతున్నారు. పవన్ రెండుచోట్ల గెలిచేవారని, జనసేనకు బాగానే సీట్లు వచ్చేవి అని అంటున్నారు. కానీ విడి విడిగా పోటీ చేయడం వల్ల డ్యామేజ్ జరిగిపోయిందని, ఈ సారి మాత్రం అలా జరగకుండా ఉండాలంటే పవన్ సపోర్ట్ తీసుకుంటేనే మంచిదని తమ్ముళ్ళు భావిస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో సమీకరణాలు ఎలా మారుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: