మాన్సాస్ ట్రస్టు, సింహాచల దేవస్థానం ఛైర్మన్‌గా సంచయితని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలని హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. వంశ పారంపర్యంగా ఉన్న రూల్స్ ప్రకారం కుటుంబ పెద్దగా ఉన్న అశోక్ గజపతిరాజునే ఛైర్మన్‌గా కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అసలు వంశపారంపర్యంగా ఉన్న నిబంధనలు పక్కనబెట్టి సంచయితని ఛైర్మన్ చేసి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేతులు కాల్చుకుందని అంటున్నారు. అయితే వాస్తవానికి చూస్తే అలాంటి పరిస్థితే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న మాన్సాస్ ట్రస్ట్ నిబంధనలు చూస్తే కుటుంబంలో పెద్దకే ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలి. అందుకే గత కొన్నేళ్లుగా కుటుంబ పెద్దగా ఉన్న అశోక్, ఆ బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు.

కానీ అశోక్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సంచయితని తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం ఛైర్మన్ చేసింది. ఇక అది పెద్ద మిస్టేక్ అని ఇప్పుడు కోర్టు తేల్చేసింది. మళ్ళీ అశోక్‌కే బాధ్యతలు అప్పగించాలని చెప్పింది. ఇలా తప్పు సరిదిద్దుకోమని కోర్టు చెప్పిన వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కోర్టు తీర్పుపై భవిష్యత్ కార్యాచరణని రూపోదించుకుని ముందుకెళ్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. అసలు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ ఏం సాధించారని, గతంలో ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలని బయటపెడతామని మాట్లాడుతున్నారు. అయితే వెల్లంపల్లి ఇప్పటికే అశోక్ విషయంలో ఒకసారి నోరుజారి విమర్శలు పాలయ్యారు. అశోక్ మనస్తత్వం తెలిసినవారు, ఆయనపై విమర్శలు చేయరు.

ఆఖరికి విజయనగరం వైసీపీలో కీలకంగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ సైతం, అశోక్‌పై ఎన్నడూ విమర్శలు చేయలేదు. కానీ వెల్లంపల్లి పరుష పదజాలంతో దూషించారు. ఇప్పుడు ట్రస్ట్‌లో అక్రమాలు బయటపెడతామని అంటున్నారు. అయితే ఏడాదిగా ట్రస్ట్ సంచయిత చేతుల్లోనే ఉంది. మరి అప్పుడే అక్రమాలని బయటకుతీసే కార్యక్రమం చేస్తే బాగుండేది అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులు ఎవరు దానం చేశారో ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదని, అశోక్ గజపతిరాజు వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసని మాట్లాడుతున్నారు. ఇక అలాంటి వ్యక్తిపై మరోసారి బురదజల్లితే వైసీపీ ప్రభుత్వానికే ఇబ్బంది అని కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: