తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి దాదాపుగా సైలెంట్ అయిపోయింది. పెద్దగా మీడియా ముందుకు కూడా నేతలు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే చాలా కాలం నుంచి స్తబ్దుగా ఉన్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ''ఒక చేతితో ఉచితాలు ఇస్తూ మరో చేతితో నూతన విధానాన్ని ప్రవేశపెట్టి సామాన్య ప్రజల నడ్డివిరిచే కార్యక్రమానికి వైసిపి శ్రీకారం చుట్టింద''ని బిజెపి ఆరోపిస్తోంది. అంతే కాక వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితాలు ఇచ్చుడు, పన్నులు పెంచుడు అనే పేరుతో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద నిబంధనలు పాటిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెబుతూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బిజెపి నేతలు సోషల్ మీడియా వేదికగా తమ కార్యకర్తలను కోరారు. నిజానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజును తొలగించి బీజేపీ చీఫ్ గా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డి నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బిజెపికి సంబంధించిన ఎలాంటి వార్తలు కూడా మీడియాలో రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో వైసిపిని ఇరుకున పెట్టే విధంగా బిజెపి పని చేయబోతోందని అంటున్నారు.

 నిజానికి జగన్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి. ముందుగా అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాగా చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. అయితే ఆయన ఆంతరంగిక స్నేహితుడు ఒకరు చనిపోవడంతోనే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని చెబుతున్నా ఆయన మరుసటి రోజే మరికొందరు ముఖ్యమంత్రులను కలిశారు. ఆ తరువాత మూడు రోజులుకి కానీ జగన్ కి అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుంటే జగన్ ని ఉపేక్షించవద్దని అమిత్ షానుంచి ఆదేశాలు అందడంతో నే బిజెపి జగన్ ని నేరుగా టార్గెట్ చేయడం మొదలు పెట్టిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: