భారతీయ జనతాపార్టీ నేతలెవరూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీగా అంటకాగవద్దని, నిజాయితీగా వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్ ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. కోర్టుల్లో జగన్‌కు ఉన్న కేసులకు సంబంధించి బీజేపీ నేతలు పలువురు ఆయా కేసుల దర్యాప్తులో భాగమైన అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని, నివేదికలు బలహీనంగా తయారుచేయడం, సాక్ష్యాధారాల్లో బలం లేకుండా చూడటమనే అంశాలున్నాయని పవన్ అంచనా. చట్టం తన పని తానుచేసుకుపోయాలా చూడాలని, కేసుల విషయంలో జగన్‌కు లోపాయికారీగా సహకరిస్తోన్నవారిని దారికి తీసుకురావాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి జీవీ ఎల్ నరసింహారావుకు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా చిత్రంగా ఉందంటూ అధికార పార్టీనుంచే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. జీవీఎల్ అయితే తమకు సహకరిస్తారనే అంచనాలో వైసీపీలో వారున్నారు. మిత్రపక్షం కానీ పార్టీ తమ మిత్రుడికి మంత్రి పదవి కోసం ప్రయత్నించడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పవన్‌క‌ల్యాణ్ బీజేపీ ఢిల్లీ పెద్దలతో ప్రస్తావించినట్లు సమాచారం.

పవన్‌క‌ల్యాణ్ కోసం బీఎల్ సంతోష్?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే పవన్‌క‌ల్యాణ్‌కు చోటుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్ ఎస్ ఎస్‌లో ప్రముఖుడైన బీఎల్ సంతోష్ పవన్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు సంతోష్ కారణంగానే మంత్రి పదవులు పొందినట్లు తెలిసిన విషయమే. జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడవడం, అది అలాగే కొనసాగడానికి కూడా ఆయనే కారణం. ఇటీవలి కాలంలో తెలంగాణలోని పార్టీ నేతలు తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జ‌న‌సేనాని ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రోజే టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తోన్న మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కూతురికి మద్దతు ప్రకటించారు. తెలంగాణలో ఆ పార్టీతో దాదాపు తెగదెంపులేనని, ఇక ఏపీలోను పొత్తు నిలవందంటూ వార్తలు వచ్చాయి. అప్పటినుంచి పవన్‌ తెలంగాణ, ఆంధ్ర బీజేపీ నేతలతో అంటీ ముట్టనట్లుగానే మెలుగుతున్నారు. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మంత్రిపదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా ఏపీ నుంచి జ‌న‌సేనానికి ఇవ్వాలనుకుంటోందని ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, కలిసే ఉందామని, అయితే రాజకీయాలు నిజాయితీగా చేద్దామని, లోపాయికారీగా కేంద్రంలోని పెద్దలుకానీ, రాష్ట్రంలోని నేతలు కానీ ఎవరూ వైసీపీకి సహకరించకూడదని, దానివల్ల విలువలు కలిగిన రాజకీయం చేయలేమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా మసకబారిపోయిన ప్రభను వెలిగించుకోవడానికి, రైతుచట్టాలతో వ్యక్తమవుతోన్న వ్యతిరేకతను తట్టుకోవడానికి నరేంద్రమోడీ తంటాలు పడుతున్నారు. పవన్ సూచన మేరకు విలువలు కలిగిన రాజకీయం చేయడానికి బీజేపీ అంగీకరించిందా? లేదా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

tag