తెలంగాణ రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు సుడిగాలి పర్యటనలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని మేడారంలో నిరుద్యోగులతో వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి అని విమర్శించారు.. తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది ప్రాణాలు ధారపోస్తే ప్రస్తుతం వందల మంది ఉద్యోగాల కోసం మళ్ళీ ప్రాణాలు ధారపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆమె విమర్శించారు. 


రాష్ట్రంలో లక్షకి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్న కేసీఆర్ ఎందుకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని షర్మిల ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే స్వార్థ రాజకీయాల కోసం శ్రద్ధ చూపే ఆయన ఏడేళ్లుగా నిరుద్యోగుల కడుపు మీద మాత్రం కొడుతూనే ఉన్నారని అన్నారు. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లను సీఎం కేసీఆర్ వెంటనే విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేగాక పోరాటాలు తెలంగాణ గడ్డపై మీతో కలిసి పోరాడుతానని పేర్కొన్న ఆమె ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అంతేకాక సోషల్ మీడియా వేదికగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ అలాగే వాట్సాప్ నెంబర్ కూడా షర్మిల షేర్ చేస్తున్నారు. 


ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా షర్మిల ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. ఇక వీలైనంత త్వరలో షర్మిల పార్టీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా జూలై ఎనిమిదో తారీఖున పార్టీ ప్రకటించే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అండతో ఆమె ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యంలేదని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: