ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయాల‌న్నా ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈట‌ల రాజేంద‌ర్ మొద‌ట తాను ఆత్మ‌గౌరవం కోసం కొట్లాడుతాన‌ని, ఒంట‌రిగానే పోటీ చేస్తానంటూ ప్ర‌క‌టించారు. కానీ అనూహ్యంగా బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు రాజ‌కీయాలు మారిపోయాయి. ఇక ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ కూడా బీజేపీ గూటికి మిగ‌తా వారిని తీసుకొస్తాన‌ని చెబుతున్నారు.

దీంతో ఈటలపై  మావోయిస్టు పార్టీ సీరియ‌స్ అయింది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌పై ఘాటు లేఖ విడుదల చేసి ఈ లేఖ ఇప్పుడు రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఎందుకంటే ఈట‌ల రాజేంద‌ర్ అంటే మొద‌టి నుంచి క‌మ్యూనిస్టు భావాలు ఉన్న నేత‌గా గుర్తింపు ఉంది. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు బీజేపీలో చేర‌డంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే మొన్న ఈటల రాజేందర్ త‌న అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌టన ఇచ్చారు. దీంతో ఈ ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ తాను నియంత అయిన కేసీఆర్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాడ‌తాన‌ని, ఆత్మ‌గౌర‌వం కోసం కొట్లాడుతాన‌ని ప్ర‌క‌టించాడు. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా హిందూత్వ మ‌చ్చ ఉన్న బీజేపీలో లో చేరాడంటూ మావోయిస్టు పార్టీ మండిపడింది.

ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్, ఈట‌ల రాజేందర్ కు మధ్య జరుగుతున్న పోటీ వారిద్ద‌రికి సంబంధించిన‌ద‌ని, దానికి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టు పార్టీ స్ప‌ష్టం చేసింది. కాగా కేసీఆర్‌తో పాటు ఈటల కూడా ఒకే గూటికి చెందిన దొంగ పక్షుల‌ని తెలిపింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కేసీఆర్, ఈట‌ల రాజేందర్ క‌లిసి ప్ర‌జ‌లను మోసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌రి దీనిపై ఈట‌ల ఏమైనా స్పందిస్తారో లేదో అన్న‌ది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: