ఏపీలో బీజేపీ, జనసేన కలసి పనిచేస్తాయని పొత్తు కుదిరినప్పటినుంచి చెబుతూనే వస్తున్నారు నేతలు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కలసి పాల్గొంటాయని అన్నారు. బీజేపీ, జనసేన కలిస్తే.. తిరుగే లేదని, అసలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాదని, వచ్చే ఎన్నికల తర్వాత అధికార పక్షంలో కూర్చుంటామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన ఏనాడూ కలసి పనిచేయలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

తాజాగా ఆస్తి పన్ను పెంపు, చెత్తపన్ను విధించడంపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. కానీ జనసేన నాయకులు కానీ, జనసైనికులు కానీ ఎక్కడా ఈ కార్యక్రమాల జోలికి వెళ్లలేదు. కేవలం బీజేపీ నేతలు మాత్రమే తమ పార్టీ ఆఫీస్ లకి పరిమితం అయి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ప్లకార్డులు చేతబట్టుకుని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంలో మిత్రపక్షం జనసేనను ఎందుకు కలుపుకోలేదనేదే ఇప్పుడు ప్రశ్న.

అయితే మొహమాటానికి జనసేన తరపున ఓ ట్వీట్ మాత్రం వేయించారు. అది కూడా నాదెండ్ల మనోహర్ పేరుతో. చెత్త పన్ను విధించడం సరికాదని, ప్రజలు కష్టాల్లో ఉంటే చెత్త పన్నుతో పీడిస్తారా అంటూ నాదెండ్ల మనోహర్ పేరుతో జనసేన ఓ లేఖను విడుదల చేసింది. అంతకు మించి ఈ వ్యవహారంలో జనసేన యాక్టివిటీ ఏమాత్రం లేదు. పవన్ కల్యాణ్ కూడా ఎక్కడా ఈ కార్యక్రమాలపై నేరుగా స్పందించలేదు.


 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన పూర్తి స్థాయిలో కలసి పనిచేయలేదనే అపవాదు ఉంది. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు అంతంతమాత్రంగానే ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. పవన్ కల్యాణ్ బీజేపీతో స్నేహంగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో జనసైనికులు బీజేపీతో కలసి పనిచేయలేకపోతున్నారని అంటున్నారు. పొత్తులతో కాలక్షేపం చేస్తే.. సొంతగా పార్టీని బలోపేతం చేసుకోలేమనేది జనసైనికుల వాదన. ఎప్పటికప్పుడు ఇలా ఎవరి కార్యక్రమాలతో వారు బిజీగా ఉంటే.. ఇక రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ఎక్కడ కనపడుతుందనే వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: