ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంత వేగంగా  వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడానికి టీకా ఒక్కటే మార్గం అంటూ అటు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయ్. ఈ క్రమంలోనే శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.  అదే సమయంలో తమ దేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా.. ఇక ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో కూడా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయ్ ఆయా దేశాల ప్రభుత్వాలు.



 ఇప్పటికే భారత్లో సెకండ్ వేవ్  వైరస్ శరవేగంగా పాకిపోయింది. భారీగా కేసులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులపై కూడా అటు ఇతర దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేసాయి. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన కొనసాగుతోంది.  అయితే ఇక ఈ నిబంధన కారణంగా అటు విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అయితే ప్రస్తుతం భారత్లో  కేసుల సంఖ్య తగ్గటం..  వ్యాక్సినేషన్  కూడా వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షల సడలింపు ఇస్తాయి.



 ఇక ఇటీవల దక్షిణ కొరియా భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న భారతీయులు తమ దేశానికి వస్తే ఇక క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది దక్షిణకొరియా ప్రభుత్వం.  వైరస్ కట్టడి లో భాగంగా ఇప్పటివరకు విధించిన రెండు వారాలు తప్పనిసరిగా క్వారంటైన్  నిబంధనలను తొలగిస్తున్నట్లు దక్షిణకొరియా ప్రభుత్వం తెలిపింది. జూలై 1 నుంచి ఇక ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.  మరోవైపు కోవ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: