కరోనా.. ఇప్పుడు ఇదో ప్రపంచ సమస్య. కానీ.. ఓ దేశం మాత్రం తాను కరోనాను పూర్తిగా జయించానని చెబుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ వేవ్‌లవారీగా విజృంభిస్తున్న కరోనా తమ వద్దకు రాకుండా చేసిన ఆ దేశం గొప్పదే.. అయితే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అదే దేశం ఆకలితో మల మల మాడుతోందట. ఇంతకీ ఆ దేశం ఏంటి.. ఎందుకా సమస్య. తెలుసుకుందాం..

ఆ దేశం ఉత్తర కొరియా. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ సమయంలో ఉత్తర కొరియాలో మాత్రం ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందట. ఈ అంశంపై ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మొదటిసారి నోరు విప్పారు. తమ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే.. కరోనా రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేసిందట ఆ దేశం.

కరోనా భయంతో ఉత్తర కొరియా దేశ సరిహద్దులను మూసివేసింది. కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. అంతే కాదు కరోనా భయంతో చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించింది. ఈ చర్యలతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించింది. దీనికి తోడు గత వేసవికాలంలో ఉత్తర కొరియాలో సంభవించిన తుపానులు, వరదలతో పంటలు నాశనం అయ్యాయి. ఇలా వరుస సమస్యలతో ఉత్తరకొరియా ఉక్కిరిబిక్కిరైంది.

ఇప్పుడు ఈ దేశం లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి.. అందుకే ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలు అన్వేషిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు మాత్రం మరికొంతకాలం పొడిగిస్తుందట. తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంటున్న ఉత్తర కొరియా.. ప్రజలు ఆకలితో అలమటించకుండా.. ఆకలి చావులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: