మన దేశ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్‌ చ‌రిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 52 వేల మార్క్‌ను దాటింది. ఆల్‌టైమ్ హై రికార్డులు అధిగమిస్తున్నాయి. నిఫ్టీ సూచీ కూడా జోరుగా పరుగులు పెడుతోంది. అయితే స్టాక్ మార్కెట్‌ త్వరలోనే కుప్పకూలే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.

వాటిలో మొదటిది.. స్టాక్ మార్కెట్‌ పెరగాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా పెరిగింది. ఈ అనూహ్యమైన పెరుగుదల నమ్మతగింద కాదు అని. గ‌త సంవత్సరం క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా గ‌త మార్చి నెల‌లో 25,638 పాయింట్ల‌కు ప‌డిపోయిన సెన్సెక్స్‌.. ఏడాదిలోనే అంత‌కు రెట్టింపు స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు 100 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.

మరో కారణం.. గత ఏడాది అమెరికా వంటి దేశాల నుంచి విరివిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇవి మన దేశంపై ప్రేమతో వచ్చినవి కావు. అమెరికా, యూరోపియన్ యూనియన్ లో క్వాంటిటేటివ్ ఈజింగ్ పేరిట ప్రభుత్వం డాలర్లు ముద్రించి మార్కెట్ లోకి వదిలారు. ఆ సొమ్ము మన మార్కెట్‌లోకి వచ్చింది. మన దేశ స్టాక్ మార్కెట్ లో గతంలో ఏ ఫైనాన్షియల్ ఇయర్ లోనూ ఇంత స్థాయి లో విదేశీ పెట్టుబడులు రాలేదు.

అలాగే మ్యూచ్ వల్ ఫండ్ల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు  కూడా నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ కారణాలతో మన స్టాక్ మార్కెట్లు పెరగాల్సిన దాని కన్నా చాలా ఎక్కువగా పెరిగాయి. మరి ఇలా అసంబద్దంగా పెరిగినప్పుడు మార్కెట్ కరెక్షన్ కావడం కూడా సహజమే. గతంలోనూ ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ సమయం వచ్చినట్టు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: