వైఎస్సార్ అంటేనే దైవంతో సమానంగా కొలిచే వారు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. వైఎస్సార్ మీద ఎంత ప్రేమ అంటే ఆయన మూడు దశాబ్దాల పాటు అధికారానికి  దూరంగా ఉన్నా కూడా ఆయన వెన్నంటే ఉండి కష్టానికి నష్టానికి ఓర్చిన వారు ఎందోరో తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తారు. వారికి వైఎస్సార్ అంటే అంత ప్రేమ.

మరి వైఎస్సార్ మీద ఉన్న అభిమానం తనయుడి మీద ఎందుకు చూపించలేకపోతున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. వైఎస్సార్ వెంట ఉన్న వారిలో చాలా నాయకులు ఇపుడు జగన్ తో లేరు.  వైఎస్సార్ లెగసీని సొంతం చేసుకున్న జగన్ విధేయుల ప్రేమాభిమానాలు మాత్రం పొందలేకపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్,  వైఎస్సార్ ఆత్మగా చెప్పబడే  కేవీపీ రామచంద్రరావు, ఇటీవల మరణించిన సబ్బం హరి, లగడపాటి రాజ గోపాల్ వంటి వారు ఎందరో  వైఎస్సార్ అంటే ప్రాణం పెడతారు. చిత్రమేంటి అంటే వారంతా జగన్ మీద విమర్శలు చేస్తారు.

ఇక ఈ లిస్ట్ లో మరో వీర విధేయుడు గోనే ప్రకాశరావు కూడా చేరిపోయారు. ఆయన తెలంగాణాకు చెందిన వాడు. ఆయన మాటలు తూటాలు మాదిరిగా ఉంటాయి. ఆయన వైఎస్సార్ అంటే ఎంతో ఇష్టపడేవారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన జగన్ వైపు ఉన్నారు. జగన్ ఉమ్మడి ఏపీకి సీఎం కావాలని కోరుకున్న వారిలో ఆయన అతి ముఖ్యుడు. అలాంటి నాయకుడు విభజన తరువాత సైలెంట్ అయ్యారు. ఇన్నాళ్ళకు ఇపుడు ఏపీ నడిబొడ్డు మీద జగన్ సర్కార్ ని విమర్శలు చేస్తున్నారు. జగన్ కి వైఎస్సార్ కి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెబుతున్నారు  తనకు అందరి బండారం తెలుసు అంటున్నారు. తనను కదిలిస్తే వారికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏదో రోజున  జగన్ జైలుకు పోతారని కూడా గోనె ప్రకాశరావు అంటున్నారు.

మొత్తానికి వైఎస్సార్ కి ఇష్టులైన వారికి జగన్ కష్టంగా తోస్తున్నారు. కానీ జనం మాత్రం వైఎస్సార్ లేని లోటుని జగన్ లో చూసుకుని ఆయనకు పాలన చేసే అవకాశం కల్పించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ కి బంపర్ మెజారిటీ కూడా ఇచ్చారు. మరి ప్రజలకు జగన్ లో వైఎస్సార్ కనిపిస్తున్నారు. కానీ విధేయులకు మాత్రం జగన్ శత్రువుగానే కనిపిస్తున్నాడు. తేడా ఎక్కడ ఉంది. జగన్ పోకడలలోనా. లేక వారి ఆలోచనలోనా.
 




మరింత సమాచారం తెలుసుకోండి: