రాష్ట్రం విడిపోయాక ఏపీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే విభజన ద్వారా నష్టపోయిన ఏపీని హోదా ఇచ్చి ఆదుకుంటామని అప్పటి కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అలాగే విభజనకు సంబంధించి పలు హామీలు ఇచ్చింది. ఇక అప్పుడు దీనికి బీజేపీ కూడా అంగీకరించింది. పైగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్ళు కావాలని బీజేపీ పట్టుబట్టి సాధించింది. అలా ఏపీ కోసం నిలబడిన బీజేపీ, 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెద్ద సాయం చేయలేదు.


చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా సరే రాష్ట్రానికి స్పెషల్ సాయం అందలేదు. పైగా కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉండటంతో బాబుకు చక్రం తిప్పడం కుదరలేదు. దీంతో బీజేపీ ఏమి ఇస్తే అదే బాబు తీసుకున్నారు. ఆఖరికి హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు, ప్యాకేజ్ ఇస్తామని చెబితే ఒప్పుకున్నారు. కానీ 2019 ఎన్నికల ముందు బీజేపీ నుంచి బయటకొచ్చి హోదా కోసం బాబు ధర్మపోరాట దీక్షలు అంటూ రాష్ట్ర ప్రజల డబ్బులని తెగ ఖర్చు పెట్టారు. అటు జగన్ సైతం ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పరు. అలాగే బాబు వల్లే హోదా పోయిందని విమర్శించారు.


ఇక జగన్ అధికారంలోకి వచ్చాక హోదా అంశం పూర్తిగా నీరుగారిపోయింది. మళ్ళీ కేంద్రంలో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో హోదా తీసుకురాలేమని జగన్ చేతులెత్తేశారు. కేంద్రాన్ని హోదా ఇవ్వమని బ్రతిమలాడటం తప్ప ఏమి చేయలేమని చెప్పేశారు. అయితే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి, జగన్ మెడలు వంచారని, కేసులు కోసం రాష్ట్ర ప్రయోజనాలని ఢిల్లీలో తాకట్టు పెట్టారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. కాదు కాదు బాబు వల్లే హోదా పోయిందని, ప్యాకేజ్‌కి ఒప్పుకుని హోదాని తాకట్టు పెట్టారని జగన్ మండిపడుతున్నారు. ఇలా ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, కేంద్రంపై పోరాటం కూడా చేయడం లేదు. బాబు,జగన్‌లు తిట్టుకుంటుంటే మధ్యలో బీజేపీ తప్పించుకుంటుంది. ఇక బాబు-జగన్‌లు ఇద్దరు కేంద్రంపై పోరాటం చేయనంత కాలం హోదా రావడం కష్టమే.     

మరింత సమాచారం తెలుసుకోండి: