ఏపీలో మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే లాబీయింగ్ చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో జగన్ రెండో విడత కేబినెట్ విస్తరణ చేయనుండటంతో పెద్ద సంఖ్యలో ఆశావాహులు మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.


ప్రస్తుతం చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఇక వీరిలో పెద్దిరెడ్డి మంత్రిగా ఐదేళ్లు కొనసాగడం ఖాయమని తెలుస్తోంది. మంత్రిగా, వైసీపీ నేతగా పెద్దిరెడ్డి పాత్ర ఎలా ఉందో అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుని వైసీపీ కంచుకోటగా మార్చేశారు. అటు బాబు నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. మంత్రిగా కూడా పెద్దిరెడ్డి అదరగొడుతున్నారు. కాబట్టి పెద్దిరెడ్డి ఐదేళ్లు మంత్రిగా కొనసాగనున్నారని తెలుస్తోంది.


నారాయణస్వామి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఈ జిల్లాలో చాలామంది ఆశావాహులు క్యూలో ఉన్నారు. నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మొదట విడతలోనే పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు ఆమెకు పదవి దక్కలేదు. కానీ జగన్ ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇక ఈ సారి మాత్రం పదవి దక్కించుకోవాలని రోజా చూస్తున్నారు.


అటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు సైతం జగన్ కేబినెట్‌లో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా అదరగొడుతున్నారు. పైగా భూమన మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడే మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక జిల్లాలో ఉన్న జూనియర్ ఎమ్మెల్యేలు సైతం లక్కీగా పదవి రాకపోతుందా అని చూస్తున్నారు. మరి చూడాలి ఈ సారి చిత్తూరు జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: