బీజేపీ తొలిసారి అధికారంలోకి రావడానికి కారణం.. అప్పట్లో అద్వానీ చేపట్టిన రథయాత్రేనని చాలామంది నిశ్చితాభిప్రాయం. అప్పటి వరకూ ఉత్తరాదికే చెందిన పార్టీ అని బీజేపీపై ఓ బలమైన ముద్ర ఉండేది. అద్వానీ యాత్రతో బీజేపీ ఎల్లలు చెరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాంటి పరిస్థితికే వచ్చింది. దక్షిణాదిలో కాంగ్రెస్ నుంచి ఒక్కో రాష్ట్రం చేజారిపోయింది. ఉత్తరాదిలో కూడా హస్తం పార్టీ కునారిల్లుతోంది. ఈ దశలో దేశం మొత్తంలో కాంగ్రెస్ శ్రేణుల్ని తిరిగి పునరేకీకరణ చేయాలి. దానికోసం కచ్చితంగా దేశవ్యాప్త యాత్ర మొదలు కావాలి, దానికి రాహుల్ గాంధీ సారధ్యం వహించాలి. సామాన్యులకు భరోసా అందించేలా ఈ యాత్ర మొదలు కావాలి.

బీజేపీని ఎదుర్కోవాలంటే.. దేశవ్యాప్తంగా బలం పెంచుకోవడం ఒక్కటే కాంగ్రెస్ ముందున్న ఏకైక మార్గం. సోషల్ మీడియాలో మోదీపై విమర్శలు గిప్పించినా, ఢిల్లీనుంచి ఆయనపై సెటైర్లు వేసినా, పార్లమెంట్ లో పరాచకాలాడినా ఏమాత్రం సరిపోదు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉన్న ఈ దశలో రాహుల్ గాంధీ కచ్చితంగా దేశవ్యాప్త పర్యటనకు సిద్ధం కావడం ఒక్కటే ఆ పార్టీ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం.

కరోనా కష్టాన్ని అవకాశంగా తీసుకుని, సామాన్య ప్రజల కష్టాల్ని కళ్లకు కడుతూ, వారికి భరోసానిస్తూ, భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా రాహుల్ యాత్ర ఉండాలి. గతంలో రాహుల్ ఉత్తరాదిలో సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారని, కరోనా కష్టాలతో చితికిపోయిన కుటుంబాలను ఓదారుస్తారని ఇండియా హెరాల్డ్ గతంలోనే చెప్పింది. ఆ తర్వాత ఇతర మీడియా కూడా దీనిపై వార్తలిచ్చింది. అయితే సెకండ్ వేవ్ కారణంగా రాహుల్ ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా రాహుల్ జనాల్లోకి వచ్చి దేశం మొత్తాన్ని చుట్టేలా యాత్ర మొదలు పెడితే పార్టీకి మంచి ఊపు రావడం ఖాయం.

బీజేపీ హిందూత్వాన్ని ఎదుర్కోవడం ఎలా..?
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, కుల, మత రాజకీయాలకు చోటు ఉండదు. కానీ బీజేపీ అలా కాదు. లౌకిక వాదం తమ అజెండా అని చెబుతూనే.. అసలు విషయం వచ్చే సరికి తమ అసలు రంగు బయటపెడుతుంది. అయితే బీజేపీ అజెండాతో అనుకోకుండా కాంగ్రెస్ ఓ వర్గానికి దూరమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ హిందువులకు దగ్గరకావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ దేవాలయాల సందర్శన కూడా ఇందులో భాగమే. హిందూ ఓట్లను ఆకర్షించడానికి రాహుల్ కూడా ఇప్పుడు బీజేపీ బాటలోనే వెళ్తున్నారు. స్వామీజీలను కలుస్తున్నారు, మఠాధిపతులతో మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన పార్టీతో కలసి నడుస్తున్నారు.

ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లాల్సిందే..
ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి రావడానికి కారణం.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నిటినీ బీజేపీ చేరదీయడమే. 2014లో సొంత బలంతో అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశమున్నా కూడా ప్రతిపక్ష పార్టీలతోనే కూటమి కట్టింది బీజేపీ. 2019లో కూడా అదే కొనసాగించింది. అయితే ఇప్పుడు ఆ కూటమినుంచి చాలామంది బయటకు వచ్చేశారనుకోండి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఇదే మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సి ఉంది. రాహుల్ గాంధీ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రయత్నం సక్సెస్ అయింది. రాష్ట్రాలను కలియదిరిగి బీజేపీ వ్యతిరేక వర్గాన్ని ఏకం చేయగలిగితే.. రాహుల్ గాంధీ భావి ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎదిరించి నిలబడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: