ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప‌రిస్థితి ఇప్పుడు అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంది. ఒక‌రికి న్యాయం చేద్దామంటే ఇంకొరికి అన్యాయం చేసిన‌ట్ల‌వుతుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలి? ఎవ‌రికీ మ‌ద్ద‌తివ్వ‌కుండా పురాణాలు చెప్పినట్లు త‌మ్ముడు త‌న‌వాడైనా ధ‌ర్మం చెప్పాల‌నే సూత్రాన్ని ఆచ‌రిస్తారేమోన‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు అంటున్నాయి. లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీలో చీలిక‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఒక‌వైపు, పాశ్వాన్ త‌మ్ముడు ప‌శుప‌తికుమార్ మ‌రోవైపు న్యాయం కోసం మోడీవైపు మొహ‌రించారు. ఎంపీల బ‌లం ఉన్న ప‌శుప‌తికి మ‌ద్ద‌తివ్వాలా? త‌న చిరకాల స్నేహితుడైన పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌కి మ‌ద్ద‌తివ్వాలా? అనే విష‌యాన్ని మోడీ తేల్చుకోలేక‌పోతున్నారు. న్యాయంగా అయితే ప‌శుప‌తి వైపు మొగ్గాలి.. ధ‌ర్మంగా అయితే చిరాగ్‌వైపు మొగ్గాలి. ప్ర‌ధాన‌మంత్రి న్యాయాన్ని గెలిపిస్తారా? ధ‌ర్మాన్ని గెలిపిస్తారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొంప ముంచిన చిరాగ్ ఒంటెత్తు పోక‌డ‌లు
రాంవిలాస్‌పాశ్వాన్ మ‌ర‌ణంతో లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోవ‌డంతో పార్టీలో అంద‌రూ అసంతృప్తిగా ఉన్న‌ట్లు మొద‌టినుంచి వార్త‌లు వ‌చ్చాయి. అయితే రోజులు గ‌డిచేకొద్దీ ఆ అసంతృప్తి తిరుగుబాటుకు కార‌ణ‌మైంది. దుందుడుకు వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు ప‌శుప‌తిపై మాట జారిన చిరాగ్ అందుకు త‌గ్గ మూల్యం చెల్లించుకున్నారు. ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు ప‌శుప‌తివైపు మొగ్గారు. త‌మ‌దే అస‌లైన లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీగా గుర్తించాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తాజాగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా కూడా ప‌శుప‌తి ఎంపిక‌య్యారు. ఈ ప‌రిణాల‌న్నీ చిరాగ్‌ను ఒంట‌రిచేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

ఆశాజ‌న‌కంగా లేని బీజేపీ భ‌విష్య‌త్తు?
ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఎవ‌రికి బ‌లం ఉంటే వారే గొప్ప‌. ఐదుగురు ఎంపీలున్న ప‌శుప‌తివైపు మొగ్గితే ఎన్డీయేకు బ‌లం త‌గ్గ‌కుండా ఉంటుంది. కానీ పార్టీ నేత‌లెవ‌రూ చిరాగ్‌ను అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. ఇంత జ‌రిగినా చిరాగ్ వ్య‌వ‌హారంలో మార్పురాలేద‌ని, మోడీ త‌న‌కు న్యాయం చేస్తార‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని, కానీ ఈ త‌ర‌హా పోక‌డ‌లు భ‌విష్య‌త్తులో లోక్‌జ‌న‌శ‌క్తికి చేటు చేస్తాయ‌ని ప‌శుప‌తి వ‌ర్గీయులు అంటున్నారు. వ‌రుస‌గా త‌గులుతున్న ఎదురుదెబ్బ‌లు ప్ర‌ధాన‌మంత్రి వైఖ‌రిలో మార్పు తెస్తున్నాయి. రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌వుతోంది. వ‌చ్చే ఏడాది మ‌రో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిల్లో గెలుస్తాన‌మ‌నే న‌మ్మ‌కం బీజేపీలో క‌న‌ప‌డ‌టంలేదు. ఈ త‌రుణంలో ఐదుగురు ఎంపీల బ‌లం ఎందుకు పోగొట్టుకోవ‌డ‌మ‌నే ఆలోచ‌న చేస్తే ప‌శుప‌తివైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎవ‌రు ఎవ‌రివైపు మొగ్గుచూపుతార‌నేది కాల‌మే నిర్ణ‌యించాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి:

tag