ఈటల  జమున హుజురాబాద్ ఆటలో  నిలవనుందా.. !

 తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల కన్నంతా హుజురాబాద్ నియోజకవర్గం మీదే ఉన్నది.  ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి వేసింది కూడా  హుజురాబాద్ గడ్డ మీద నుంచే అని చెప్పవచ్చు.  ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఈటల రాజేందర్ కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి, ప్రత్యేక రాష్ట్రం కొరకు కొట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది.  దీంతో టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బిజెపిలో చేరి,  ఆత్మగౌరవ నినాదంతో ఒకప్పుడు  ఎలా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిండో, అదే విధంగా ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగుతున్నారనడంలో అతిశయోక్తి లేదు.  

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ పార్టీలో ఆయన ఆత్మ గౌరవం ప్రజలు గుర్తిస్తారా..?  తెగించి కొట్లాడిన కారు పార్టీని నమ్ముతారా..? హస్తానికి అభయమిస్తారా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ త్రిముఖ పార్టీలు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో,  అసలు ఎవరిని పోటీలో నిలబెడతారో  అర్థం కాని పరిస్థితుల్లో రోజురోజుకు హుజురాబాద్ రాజకీయం వేడెక్కుతుంది.  అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి  కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజనమ్మ పోటీచేసే అవకాశం కనిపిస్తోందని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.  అయితే ఒకవేళ సరోజనమ్మ పోటీ చేస్తే,  వారికి దీటుగా పోటీగా ఈటల రాజేందర్ సతీమణి జమునను బరిలో దింపే అవకాశం ఉన్నది.

 ఇప్పటికే జమున హుజూరాబాద్ నియోజకవర్గం లో తన ప్రచారాన్ని మొదలు పెట్టింది.  మొన్నటి వరకు,  గృహిణిగా ఉండి,  హెచరీస్  వ్యాపారాలు చూసుకున్న జమున రాణి రుద్రమదేవిల మీడియా ఎదుట తన మాటల తూటాలను,  పదునైన బాణాల వలే వదులుతున్నారు.  దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్త రాజకీయ ఒరవడి ఏర్పడిందని చెప్పవచ్చు.  ఆమె గత మూడు రోజుల నుంచి కమలాపూర్,  ఇల్లంతకుంట తదితర మండలాల్లో పర్యటిస్తూ తన ప్రచారాన్ని గెలుపు దిశగా మలచుకుంటున్నారు. ఒకవేళ జమున పోటీ చేస్తే హుజురాబాద్  ఆటలో గెలుస్తుందా..?  కేసీఆర్ దాటికి కొట్టుకు పోతుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇలాంటి  ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కేసీఆర్ దిట్ట చెప్పవచ్చు. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న హుజురాబాద్ రాజకీయం తెలంగాణలో ఒక పెను మార్పు తీసుకువస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: