షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోంది అని తెలిసినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై చర్చ జరుగుతూ ఉంది. ఏపీలో అన్న సీఎంగా ఉన్నప్పుడు, షర్మిల ఎందుకు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టనుంది అన్న అంశాలు తెరపైకి వచ్చాయి. కానీ షర్మిల క్లారిటీ ఇచ్చిన ప్రకారం, మా నాన్నగారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం మొదలు పెట్టిన ఎన్నో కార్యక్రమాలు వివిధ కారణాల వలన సరిగ్గా ప్రజలకు అందడం లేదు. అందుకే ఆయన ఆశయాలను మరియు పధకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి నేను తెలంగాణలో పార్టీ పెడుతున్నాను అని వివరణ ఇచ్చింది. దీనితో గతంలో వైఎస్ ను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు షర్మిల మాటల పట్ల ఆమె లక్ష్యం పట్ల ఆకర్షితులయ్యారు.

ఇప్పటికే పార్టీ పేరును ఈసీ దగ్గర రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. పార్టీ పేరును మరియు పార్టీ జెండాను రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని జులై 6 న అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇప్పటికే షర్మిల పార్టీలో చైర్మన్ గా వ్యవహరిస్తున్న వాడుక రాజగోపాల్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రస్తుతం షర్మిల పార్టీ టార్గెట్ ఎవరన్న విషయం ఇప్పుడు రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే షర్మిల వ్యాఖ్యలు మరియు పార్టీ పట్ల వివిధ పార్టీల నాయకుల స్పందనను బట్టి కొన్ని విషయాలు అర్ధం అవుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున షర్మిల ప్రభావం ఆ పార్టీపై ఏమీ ఉండబోదని స్ఫష్టం అవుతోంది. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కి వైఎస్ జగన్ కు మధ్యన అనుకూల సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. కావున అన్నకు వ్యతిరేకంగా షర్మిల ప్రవర్తించబోదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మిగిలింది భారతీయ జనతా పార్టీ మాత్రమే, షర్మిల పార్టీ ప్రధాన ఉద్దేశ్యం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేయడమే అని తెలుస్తోంది. ఆ దిశగా షర్మిల కార్యాచరణ ఉండనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటివరకైతే తెరాస పార్టీని ప్రశ్నించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో బీజేపీకి చెక్ పెట్టే దిశగానే ముందుకు సాగుతుందని సమాచారం. మరి దీనికి బీజేపీ నాయకత్వం విధంగా ఎదుర్కోనుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: