రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపటి నుంచి మూడురోజులు జిల్లాల్లో పర్యటించనున్నారు. యాదాద్రి, కామారెడ్డి, వాసాలమర్రి, వరంగల్, భువనగిరి, సిద్ధిపేటలో పర్యటిస్తారు. సాధారణ కార్యక్రమంలానే కనపడినప్పటికీ దానివెనక కేసీఆర్ రాజకీయ చతురత, హుజూరాబాద్ ఉప ఎన్నిక స్వప్రయోజనమనే అంశాలు కూడా ఇమిడివుంటాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు రాజకీయంగా ప్రయోజనం కలిగేలా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

సర్పంచ్ తో మాట్లాడి ఏర్పాట్లు చూడాలని కోరిన కేసీఆర్
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి వాసాలమర్రిపై పడింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఈ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో కలిసి స‌హ‌పంక్తి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 22వ తేదీన ఆ గ్రామం వెళ్లనున్నారు. వాసాల‌మ‌ర్రివాసుల‌కు కూడా మంచి దావ‌త్ ఇచ్చిన‌ట్లుంటుంద‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాలంటూ ఆగ్రామ సర్పంచ్ తో స్వయంగా మాట్లాడారు. ఈనెల 21వ తేదీన కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన కడియంకు మొదట్లో మంచి ప్రాధాన్యం దక్కింది. ఆ తర్వాత మాత్రం ఏ పదవులు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అయినా ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నిక నేపథ్యంలో కడియం ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ ను మంచి చేసుకోవడంలో భాగంగా ఆయన కూడా ఈటెలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

సీనియ‌ర్ల‌ను మంచిచేసుకునే దిశ‌గా..
గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి కూడా కొద్దిరోజుల నుంచి కేసీఆర్‌పై, పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న్ను కూడా బుజ్జ‌గించే ప‌నిలో ముఖ్య‌మంత్రి నిమ‌గ్న‌మ‌య్యారు. క‌డియం, గుత్తా కాకుండా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నించిన కేసీఆర్ వీరంద‌రినీ ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చే ఆలోచ‌న చేస్తున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న అయిన త‌ర్వాత దీనిపై దృష్టిసారించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఈటెల బీసీ వ‌ర్గం కావ‌డం, రాష్ట్రంలో బీసీ జ‌నాబా ఎక్కువ‌గా ఉండ‌టం.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు టీఆర్ ఎస్ నాయ‌కులు పార్టీకి రాజీనామాలు స‌మ‌ర్పించ‌డం కేసీఆర్ ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. అందుకే ముందుగా సీనియ‌ర్ల‌ను ద‌గ్గ‌రికి తీసి వారిద్వారా హుజూరాబాద్‌లో గెలుపు కోసం ప్ర‌ణాళిక ర‌చించుకుంటున్నారు. ఎందుకంటే వీరంతా గ‌తంలో తెలుగుదేశంపార్టీలో క‌లిసి ప‌నిచేయ‌డం, తెలుగుదేశం పార్టీ బీసీల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో అటువైపు న‌రుక్కువ‌చ్చే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయో వేచిచూద్దాం..!






మరింత సమాచారం తెలుసుకోండి:

tag