దేవుణ్ని పూజిస్తే భ‌క్తి. దేశాన్ని పూజిస్తే దేశ‌భ‌క్తి. ఈ రెండు త‌మ సొంత‌మైన‌ట్లు భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం కాస్తంత ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. భ‌క్తికి, దేశ‌భ‌క్తికి తేడా తెలుసుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తే చివ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌న‌వుతామ‌నే భావ‌న కూడా ఆ పార్టీ నేత‌ల‌కు క‌ల‌గ‌డంలేదా? అంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. టిప్పుసుల్తాన్ గురించి వాస్త‌వాలు తెలుసుకోకుండా భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఏపీలోని పొద్దుటూరులో ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన టిప్పుసుల్తాన్ విగ్ర‌హానికి సంబంధించి ఆ పార్టీ ఎందుకు యాగీ చేయాల‌నుకుంటుందో కేంద్ర నాయ‌క‌త్వానిక‌న్నా తెలుసో? లేదో?.

ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా పోరాడారు
టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. మైసూరును కేంద్రంగా చేసుకొని పాల‌న కొన‌సాగించిన టిప్పుసుల్తాన్ ఏనాడూ హిందువుల‌పై దౌర్జ‌న్యం చేయ‌లేదు.. ఏనాడూ దేశాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌లేదు. త‌న పాల‌న‌లో అన్ని మ‌తాల‌ను గౌర‌వించారు. మైసూరులో మొద‌టిసారిగా చ‌ర్చిని నిర్మించింది కూడా టిప్పుసుల్తాన్ అనే విష‌యం బీజేపీ వారికి తెలియ‌దేమో. త‌న పాల‌న‌లో అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌ను గౌర‌వించ‌డ‌మే కాకుండా సొంత బిడ్డ‌ల్లా సాకారు. శ్రీ‌రంగ‌ప‌ట్నాన్ని కాపాడే ప్ర‌య‌త్నంలో బ్రిటీషువారితో జ‌రిగిన యుద్ధంలో ఆయ‌న అసువులు బాశారు. శ్రీ‌రంగ‌ప‌ట్నంలో అంద‌రూ ముస్లింలే నివ‌సించేవారా?  హిందువులు ఉండేవారు కాదా? అక్క‌డి దేవ‌స్థానం హిందువుల‌కు ప్ర‌సిద్ధికాదా? ఇటువంటి విష‌యాలేమీ విశ్లేషించ‌కుండా ఆయ‌న పేరునుబ‌ట్టి ఒక ముస్లిం అనే సాకుతో బీజేపీ రాద్ధాంతం చేయ‌డం విడ్డూరంగా ఉంది.

టిప్పుసుల్తాన్ అంటే ఓ ముస్లిం అనే భావ‌న‌లోనే బీజేపీ!
స్థానికంగా ఉండే ఒక ముస్లిం నేత కోర‌డంతో పొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద‌రెడ్డి దీనికి సంబందించి అన్ని ఏర్పాట్లు చూశారు. అయితే అక్క‌డేదో జ‌రిగిపోతున్న‌ట్లుగా బీజేపీ నేత‌లు నానాయాగీ చేశారు. గొడ‌వ చేయండంటూ పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు పిలుపునివ్వ‌డంతో కొంత గంద‌ర‌గోళం చేశారు. హిందూ వ్య‌తిరేకి, దేశానికి ద్రోహం చేశారంటూ గోల గోల చేశారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం బెంగ‌ళూరు, మైసూరుల్లో టిప్పుసుల్తాన్ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు జ‌యంతి ఉత్స‌వాల‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. క‌ర్ణాట‌క‌లోని బీజేపీ ప్ర‌భుత్వ‌మే ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తుంటే ఏపీ బీజేపీ నేత‌లు ఎందుకు రాద్ధాంతం చేయాల‌నుకుంటున్నారో.. వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలేంట‌నే విష‌య‌మై వారికే స్ప‌ష్ట‌త లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా దేశ‌భ‌క్తి అనే ముసుగు తీసేసి ఒక‌సారి వాస్త‌వ ప్ర‌పంచాన్ని చూస్తే బాగుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag