లోకేష్ మీద ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన తెలుగుదేశానికి భావి నాయకుడు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు తరువాత లోకేష్ కే టీడీపీ పగ్గాలు దక్కుతాయి. ఇందులో చెప్పుకోవడానికి వివాదం కూడా ఏమీ లేదు. లోకేష్ గత కొన్నేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.

ఇక లోకేష్ ని పప్పు అంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవరు అంటోంది. ఆయనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఏదీ లేదు అంటోంది. ఇక తాజాగా మంత్రి కొడాలి నాని అయితే చంద్రబాబుకు ఏకైక వారసుడు కాబట్టే టీడీపీకి లోకేష్ దిక్కు అయ్యారు అని కొత్త విశ్లేషణ చెప్పారు. అదే లోకేష్ కి ఒక అన్న కానీ  చెల్లెలు కానీ ఉంటే ఈపాటికే ఆయన్ని  తప్పించేసేవారు అని కూడా చెప్పుకొచ్చారు. అంటే లోకేష్ పప్పు అయినా కూడా టీడీపీ కి ఆయన సారధ్యం తప్పదు అన్నట్లుగా మంత్రి మాట్లాడారు.

మరో వైపు వైసీపీ నేతలు ఇంకో విమర్శ కూడా చేస్తున్నారు. అదేంటి అంటే లోకేష్ కి రాజకీయ బెంగ పట్టుకుంది అని. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం మరో రెండెళ్లలో ముగుస్తుందని, దాంతో ఆయన మాజీగా మారుతాడని, మళ్లీ చట్టసభల్లో లోకేష్ అడుగుపెడతాడో లేడో అని కూడా అంటున్నారు. ఈ రకమైన ఫస్ట్రేషన్ తోనే లోకేష్ వైసీపీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.

అది నిజమేనా. లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి పోతే మళ్లీ ఆయన చట్ట సభలో అడుగు పెట్టలేరా. అంటే దీని మీద రకరకాలైన మాటలు వినిపిస్తాయి. లోకేష్ కి తనకంటూ ఒక సొంత నియోజకవర్గం లేదని అనేవారూ ఉన్నారు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాక మళ్లీ ఆ వైపుగా వెళ్లలేదు. ఇక కుప్పంలో కూడా టీడీపీ ప్రభ మసకబారుతోంది.  అది ఎలాగున్నా కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ నుంచి పోటీ చేయడం ఖాయం. ఇక  లోకేష్ వేరే సీటు వెతుక్కోవాలి. అది సురక్షితం కూడా కావాలి. ఎందుకంటే ఆయన 2024 ఎన్నికల్లో ఏపీ అంతా తిరిగి ప్రచారం చేయాలి కాబట్టి. మొత్తానికి లోకేష్ లో భవిష్యత్తు బెంగ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ కి ఈ పొలిటికల్ జాబ్ టఫ్ చాలెంజే అన్నది విశ్లేషణగా ఉంది. చూడాలి మరి ఆయనకు బెంగ ఉందో, లేక ధీమా ఉందో రానున్న కాలమే చెబుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: