జగన్ అంటే పోరాట యోధుడు అంటారు. ఆయన రాజకీయ జీవితమే అలా మొదలైంది. జగన్ నాడు ఏకంగా యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీనే ఢీ కొట్టారు. అలా వీరోచితంగా పోరాడితేనే జనాల మెప్పు సంపాదించారు. జగన్ లోని ఆ సవాల్ చేసే నేచర్ జనాలకు నచ్చి ఆయన్ని ఇంతటి నాయకుడిని చేశారు.

ఇక జగన్ ముఖ్యమంత్రి కాక ముందు ప్రత్యేక హోదా మీద చాలానే మాట్లాడారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని కూడా చెప్పారు. అదే యువతకు భవిత అని కూడా అన్నారు. తమ పార్టీకి పాతికకు పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి అయినా హోదాను సాధించుకుని తీరుతామని కూడా జగన్ చెప్పారు. జనం కూడా జగన్ కి 22 ఎంపీ సీట్లు అప్పగించారు. ఇంత పెద్ద నంబర్ అంటే మామూలు విషయం కాదు.

జగన్ ముఖ్యమంత్రి అయి రెండేళ్ళు గడచాయి. హోదా ఊసు మాత్రం లేదు. జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడల్లా హోదా గురించి మాట్లాడుతున్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. జగన్ విన్నపాలకు ఢిల్లీ పెద్దలు కరగడంలేదు. మరి ఏం చేయాలి. రాజకీయ పోరాటమే చేయాలి. కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి మన అవసరం లేదు  అని జగన్ అంటున్నారు. అయితే అది లోక్ సభకు మాత్రమే పరిమితం. రాజ్యసభలో బీజేపీకి జగన్ అవసరం చాలా ఉంది.

ఈ రోజుకు బీజేపీకి అక్కడ ఉన్న సీట్లు 93 మాత్రమే. బిల్లు పాస్ కావాలంటే 123 మంది ఎంపీల మద్దతు కావాలి. ఆ విధంగా రెండేళ్ళుగా జగన్ బేషరతుగానే బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఏడాదికి పెద్దల సభలో బీజేపీ సీట్లు 75కి పడిపోతాయి. అదే సమయంలో వైసీపీకి 9 సీట్లు దాకా వస్తాయి. ఇది గుడ్ నంబర్ అన్న మాట. మరి ప్రత్యేక హోదా కోసం జగన్ పెద్దల సభలో పట్టుబడితే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. బీజేపీకి బిల్లులు సజావుగా పాస్ కావాలంటే రాజ్యసభలో వైసీపీ మద్దతు అతి ముఖ్యం. లేకపోతే బీజేపీ ఏ బిల్లునూ చట్టంగా తీసుకురాలేదు మరి అంతటి ప్రాముఖ్యమైన మద్దతు జగన్ చేతిలో ఉంచుకుని బీజపీని ఏమీ చేయలేమని అనడం సబబు కాదని అంటున్నారు. పెద్దల సభలో బీజేపీని బిగిస్తే హోదా చిటికలో వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి అలా జగన్ చేస్తారా. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: