ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కుదుపు ఉంటుందని అనుకున్నవారంతా తాజా పరిణామంతో షాకయ్యారు. యోగిపై మోదీ పైచేయి సాధించాలని చూసినా అది సాధ్యపడలేదు. యోగి కేబినెట్ లో భారీ మార్పులుంటాయి, కుదిరితే యోగినే సీఎం కుర్చీనుంచి తొలగిస్తారనే ఊహాగానాలకు ఇప్పుడు చెక్ పడింది. యూపీ కేబినెట్ లో ఎంట్రీ ఇస్తారనుకున్న ప్రధాని నరేంద్రమోదీ సన్నిహితుడు ఏకేశర్మ కేవలం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో సీఎం యోగి పంతం నెగ్గినట్టయింది.

ఉత్తర ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రాఫ్ రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు దీన్ని రుజువు చేశాయి. వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ సహా, కేంద్రంలోని కొందరు పెద్దలు ఈ విషయంలో కలవరపడ్డారు. యోగి కేబినెట్ మరమ్మతులు చేయాలని ఆలోచించారు. అయితే అదే సమయంలో యూపీలో తన మనిషిని పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి చూపించారు. తన సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు మూడేళ్లు సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పింటారు. ఆ వెంటనే ఆయన్ను బీజేపీలో చేర్చుకుని యూపీనుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో యోగి వర్గం కాస్త కలవరపడింది.

వాస్తవానికి యూపీలో యోగిని మార్చేయాలనేది మోదీ ప్లాన్. కుదరని పక్షంలో కనీసం ఏకే శర్మను యోగి కేబినెట్ లో చేర్పించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించాలనే ఆలోచన చేశారు. కానీ అవి రెండూ కుదరలేదు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో యోగి తన మాట నెగ్గించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఆయనకు బాగా ఉంది. దీంతో మోదీ పాచిక పారలేదు. యూపీ ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేయడానికి మోదీకి పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఏకే శర్మను కేవలం యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మాత్రమే నియమించగలిగారు. అది కూడా 16మంది ఉపాధ్యక్షుల తర్వాత ఆయన 17వ వ్యక్తి. అంటే ఏకేశర్మకు యూపీలో ఎలాంటి ప్రాధాన్యత లభించిందో అర్థం చేసుకోవచ్చు. యోగి కేబినెట్లో కీలక పదవి వస్తుందనుకున్న అది కుదరక పవడంతో, చివరకు 17మంది ఉపాధ్యక్షులలో ఒకరిగా సర్దుకుపోవాల్సి వచ్చింది ఏకే శర్మ. దీంతో యోగి స్టామినా అంటో అందరికీ తెలిసొచ్చింది. చివరకు ఆయన పంతమే నెగ్గింది, మోదీ పాచిక పారలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: