ఏపీలో టీడీపీ ఎంత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉందో తెలిసిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఒక నేత.. అదీ సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి హైదరాబాద్ లోని చంద్రబాబును ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఇది ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నేత ఎవరు? ఎందుకు వెళ్లారన్నది ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రు రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కూడా చ‌ర్చించార‌ని స‌మాచారం.

త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని.. ఆ బాధ్యతలు ఇస్తే పార్టీని బలోపేతం చేస్తానని బాబుకు రాంప్రసాద్ రెడ్డి విన్నవించినట్టు తెలిసింది. రాంప్రసాద్ రెడ్డి గ‌తంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్ర‌బాబు శ్రీకాళహస్తికి వెళ్లినప్పుడు కూడా ఆయ‌న్ను క‌లిశారు. స్థానిక రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. రాయ‌చోటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న విప్ శ్రీకాంత్ రెడ్డి రాం ప్ర‌సాద్ రెడ్డిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాక వీరిద్ద‌రి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీలోకి రావాల‌ని... అయితే ఇక్క‌డ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇస్తే వెంట‌నే పార్టీ కండువా మార్చేయాల‌ని చూస్తున్నట్టు భోగ‌ట్టా ?

ఏదేమైనా ఏపీలో వైసీపీ వేవ్ ఈ రేంజ్‌లో ఉండ‌గా.. ఆ పార్టీకి చెందిన‌. అది కూడా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన నేత పార్టీ మార‌డం అంటే అది సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. స‌హ‌జంగా అధికార పార్టీలో ప‌ద‌వులు రాని వారు విప‌క్ష పార్టీల వైపు చూడ‌డం కూడా కామ‌నే.. మ‌రి రాం ప్ర‌సాద్ రెడ్డి పార్టీ మార్పును వైసీపీ వాళ్లు ఎంత వ‌ర‌కు ప‌ట్టించుకుంటారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: