దేశ వ్యాప్తంగా చేపట్టిన లాక్ డౌన్ మంచి ఫలితాన్ని అందించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా  తగ్గు ముఖం పట్టింది. ముఖ్యంగా తెలంగాణ  విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పతనమవుతుందడడం సంతోషించదగ్గ విషయం. మే 12 న లాక్ డౌన్ విధించిన సమయంలో రాష్ట్రంలో పాజిటివ్ శాతం 6.79 ఉండగా, లాక్ డౌన్ కారణంగా, పాజిటివిటీ శాతం 1.10  శాతంగా ఉంది.  అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. లాక్ డౌన్ విధించిన ఈ సమయంలో ఈ కేసుల సంఖ్య 59,133 గా ఉండగా ఇప్పుడు అది 18,568 కి తగ్గింది. రోజుకు ఐదు వేల కేసుల వరకు నమోదు అవుతుండగా, ప్రస్తుతం 1500 దాటడం లేదు. దీనికంతటికీ లాక్ డౌన్ విధించడం మరియు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతూ వైద్య సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడం, మెరుగైన చికిత్సను అందించడం వంటివి దోహదపడ్డాయి. 

బెడ్స్ దొరక్క ఇబ్బంది పడే రోజుల నుండి పరిస్థితి మారి కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ విధించిన మొదట్లో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో మొత్తం  25,344 బెడ్స్ ఉండగా ఇప్పుడు అది  48,667  లకు చేరడం కోవిడ్ అదుపులోకి వచ్చిందన్న విషయాన్ని సూచిస్తోంది. కానీ  నిబంధనలు పాటించకపోతే మళ్లీ పరిస్థితి మొదటికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  తాజాగా 1362 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ  అయింది. 1813 మంది రికవరీ అవ్వగా మొత్తం పదిమంది కరోనాతో మరణించారు .  

ఓవరాల్ గా చూస్తే లాక్‌డౌన్‌ కి ముందు ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటోంది. దేశవ్యాప్తంగా కూడా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం విశేషం. ఇదే విధంగా రానున్న రోజుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే కరోనా థర్డ్ వేవ్ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని కరోనా వైద్య నిపుణులు  సలహా ఇస్తున్నారు. పొరపాటున గతంలో లాగా నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కరోనా నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించండి. కరోనాను తరిమి కొట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: