కరోనా భయంతో చిన్నపిల్లలకు కూడా మాస్కులు తగిలించేస్తున్నారు తల్లిదండ్రులు. అంతే కాదు, సోషల్ డిస్టెన్స్ పేరుతో వారిని మిగతావారితో కలవనీయకుండా కట్టడి చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. దీని వల్ల ఇబ్బందులే ఎక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు . బ్రిటన్ కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

కరోనా నివారణకు ప్రధాన అస్త్రాలుగా మనం ఉపయోగిస్తున్న మాస్కులు, భౌతిక దూరం పిల్లల పాలిట శాపంగా మారుతోందని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. స్కూళ్లు కూడా లేకపోవడంతో పిల్లలు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. దీంతో తోటి పిల్లలతో ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ కారణంగా వారికి వైరస్, బ్యాక్టీరియాతో సోకే వ్యాధులు గణనీయంగా తగ్గిపోయాయి. అంటే సహజంగా పిల్లల్లో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థకు పనిలేకుండా పోయిందనమాట. దీంతో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయిన తర్వాత వచ్చే సహజమైన రోగకారకాలను పిల్లలు ఎదుర్కోలేరని ఈ అధ్యయనం తెలిపింది.

సహజంగా పిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ) అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఏడాదిలోపు వారికి ఊపిరితిత్తులను దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుంది. పదేళ్లలోపు వారికి సోకినా పెద్ద ప్రమాదం ఉండదు కానీ, జ్వరం, జలుబుతో పిల్లలు ఇబ్బంది పడతారు. కరోనా రాకముంది బ్రిటన్ లో ప్రతి ఏటా సుమారు 30వేలమంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరేవారు. కానీ కొవిడ్ వచ్చిన తర్వాత మాస్కులు, భౌతిక దూరం అనే వ్యవహారంతో వీరంతా వైరస్ నుంచి తప్పించుకున్నారు. ఒకరకంగా ఇది సంతోషించదగ్గ విషయమే అయినా, మరో విధంగా దీనివల్ల వ్యతిరేక పరిణామాలు తలెత్తుతాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత సాధారణ రోజులు తిరిగి వస్తాయి, అప్పుడు ఆర్ఎస్వీ వైరస్ పిల్లలపై దాడి చేస్తే దానినుంచి రక్షించుకోడానికి సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థ వారిలో ఏర్పడి ఉండదు. అంటే రోగనిరోధక శక్తి లేక పిల్లలు తీవ్రంగా జబ్బునపడాల్సి వస్తుందనమాట.

కరోనా వల్ల తీసుకుంటున్న ముందు జాగ్రత్తల వల్ల ఇప్పటికిప్పుడు మంచే జరుగుతున్నా భవిష్యత్ లో వచ్చే రోగకారకాలను ఎదుర్కొనేందుకు శరీరం సంసిద్ధంగా ఉండటంలేదని, ఇది ముందు ముందు మరిన్ని ఇబ్బందుల్ని కలిగిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: