దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్రాల్లో కూడా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాలను ప‌రిశీలించిన తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే క‌రోనా ముప్పు పూర్తిగా తొల‌గిపోలేద‌ని, మూడోద‌శ ఉంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇటువంటి త‌రుణంలో ప్ర‌భుత్వం తొంద‌ర‌ప‌డి లాక్‌డౌన్ ఎత్తేసిందా? పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాతైతే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం కూడా మంచిదికాద‌ని, మూడోద‌శ‌లో ఎక్కువ‌గా చిన్న‌పిల్ల‌ల‌కే ముప్పుంటుందంటున్నార‌ని, అలాగే ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేదంటున్నారు.

ప్ర‌జ‌ల బ‌తుకు బండి బాగుండాల‌ని!
కొద్దిరోజులు ముందుగా స‌డ‌లింపులిచ్చ‌కుంటూ వ‌చ్చిన ప్ర‌భుత్వం ఇప్పుడు పూర్తిగా ఎత్తేసింది. సాధార‌ణ జ‌న‌జీవ‌నం క‌రోనాకు ముందు ఎలావుందో అలాగే ఉండేల‌నే ఉద్దేశంతో ఈనిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌ల బతుకు బండి ఇబ్బందుల‌కు గురికాకూడ‌ద‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని కేబినెట్ ప్ర‌క‌టించింది. అయితే ముప్పు పూర్తిగా తొల‌గిపోక‌ముందే ధియేట‌ర్లు, పార్కుల్లాంటి ప్ర‌జ‌లెక్కువ‌గా వ‌చ్చేవాటిని కూడా తెరిచేయ‌డం స‌రైన చ‌ర్యేనా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మూడోద‌శ‌లో పిల్ల‌ల‌కు ముప్పుంటుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న త‌రుణంలో పాఠ‌శాల‌లు ప్రారంభించ‌డం కూడా స‌రైంది కాద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.

త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే విద్యార్థుల‌కు ప్ర‌మాదం?
విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే క‌రోనా ప్ర‌మాదం పొంచివుంటుందంటున్నారు. ఒక‌టి నుంచి ఐదోత‌గ‌ర‌తి వ‌ర‌కు చ‌దువుకునే విద్యార్థుల‌ను కాస్తంత దూరంగా పెడితే మంచిదని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతానికి పాఠ‌శాల‌లు న‌డిపినా త‌ర్వాత కొన్ని నిబంధ‌న‌ల‌తో మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు. అదీ కాక హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రంలో ఎలాంటి ర‌ద్దీ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల‌ని కోరుతున్నారు. సిటీ బ‌స్సుల్లో ఉండే ర‌ద్దీకానీ, మెట్రోలో ఉండే ర‌ద్దీకానీ, మాల్స్ ద‌గ్గ‌ర ర‌ద్దీకానీ.. ఇలా  వీట‌న్నింటిన దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ స‌ర్కార్ ఒక నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేదంటున్నారు. టీకాలు కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా అన్నిచోట్లా అందుబాటులోకి తెచ్చి సంతృప్తిక‌ర‌మైన రీతిలో టీకా ప్ర‌క్రియ ఉంది అనుకున్న త‌ర్వాతే లాక్‌డౌన్ ఎత్తేస్తే బాగుండేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag