ఏపీలో ఈరోజు మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కొన‌సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే దిశ‌గా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి స‌హా అన్ని ప్రాంతాల్లో ఈ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వం ఆదేశించిన‌ట్టుగా 45 ఏళ్ల పై బ‌డిన వారు మ‌రియు చిన్న పిల్ల‌ల త‌ల్లులు వ్యాక్సిన్ లు వేసుకునేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.  కాగా తిరుపతిలో వ్యాక్సిన్ మేళాను ప్రిన్సిఫల్ సెక్రటరీ అనీల్ సింఘాల్ సందర్శించారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...అందరికీ రెండు డోసుల వ్యాక్సీన్ అందినప్పుడే కొవిడ్ నుంచి విముక్తి ఉంటుంద‌న్నారు. 

అప్ప‌టి వరకు జాగ్రత్తలు తప్ప‌వ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 లక్షల మందికి మొదటి డోస్, 26 లక్షల మందికి రెండో డోస్ పూర్తయ్యిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లలో కేంద్రం నుంచి వ్యాక్సిన్ సప్లై పెరుగుతుందని చెప్పారు. ఆ లోపు రోజుకు 10 లక్షల డోసులు అందించే వ్యవస్థ రాష్ట్రంలో ఉందనే నమ్మకం కేంద్రానికి రావాల్సి ఉంద‌న్నారు. అప్పుడు కేంద్రం నుంచి మ‌రిన్ని వ్యాక్సిన్ లు అందుకోవచ్చని అన్నారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పటి వరకు క‌రోనా చ‌ర్య‌ల కోసం 350 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. 

బ్లాక్ ఫంగస్ చికిత్సలో కేంద్రం పంపే కోటాను బట్టే చర్యలు తీసుకుంటామ‌ని వెల్లడించారు. రాష్ట్రంలో 18 లక్షల మంది చిన్నారుల తల్లులు ఉన్నారని.... వారిలో 5.5 లక్షల మందికి ఇప్ప‌టికే వ్యాక్సిన్ అందించామ‌ని తెలిపారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. రోజూ వారి వస్తున్న పాజిటివ్ కేసులు వేలు 6వేలకు తగ్గాయని అన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని వెల్ల‌డించారు. అంతే కాకుండా రేపటి నుంచి ఉదయం 6 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వరకూ తూర్పుగోదావ‌రి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: