సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న సిఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అక్కడ కలెక్టరేట్ ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి ఫలాలు ప్రతి గడపకు అందాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. 1969లో సిద్దిపేట గడ్డమీద తెలంగాణ నినాదం మొదలైందని ఆయన్ అన్నారు. తాగునీటి కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఆయన కనీసం అంత్యక్రియలకు నీళ్ళు ఉండేవి కావని అన్నారు. గత ప్రభుత్వాల్లో నేల విడిచి సాము చేశారని అందుకే నీళ్ళు, కరెంటు కోసం గోస పడ్డామని అన్నారు. 


కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో ధ్వంసం చేశారని అందుకే రాష్ట్రం ఏర్పాటుకు నాలుగు నెలల ముందుగానే  స్వప్నించి మిషన్ కాకతీయ పేరు పెట్టామని ఆయన వెల్లడించారు. దేశానికి ధాన్యాగారమైన పంజాబ్ ను అధిగమించామని తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల టన్నుల‌ ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు ఉండేవి...నేడు 25 లక్షలకు పెంచామని అన్నారు. చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న ఆయన తాగు నీటికి, విద్యుత్ కు కొరత లేదని అన్నారు. 


కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు,శరం లేదని అన్నారు. అధికారులకు నన్ను చూస్తూనే భయం పట్టుకుందన్న ఆయన ప్రతి ఐదు వేల మందిని క్లష్టర్ గా రైతు వేదిక నిర్మించామని అన్నారు. సిద్దిపేట చైతన్యానికి ప్రతీక అని అన్నారు. రైతు కేంద్రంగా ప్రభుత్వం పని చేస్తుందన్న ఆయన రైతు చల్లగా ఉంటే దేశం బాగుంటుందని, రైతుకు సహాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు బంధని అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా చేయడమే రైతు రాజ్యం అని అన్నారు. ఇక ఎన్టీఆర్  తీసుకు వచ్చిన రెండు రూపాయలు కిలో బియ్యం పధకం చాలా బాగా నచ్చిందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: