అనంత‌పురం జిల్లాలో ప‌ట్టు సాధించిన జేసీ బ్ర‌ద‌ర్స్‌.. కొన్నాళ్లు సైలెంట్ అయినా.. మ‌ళ్లీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మార్చిలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి మునిసిపాలిటీని ద‌క్కించుకున్న జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ‌ర్గం.. సేవ్ తాడిప‌త్రి నినాదంతో ముందుకు సాగింది. ఈ క్ర‌మంలో జేసీని చైర్మ‌న్‌గా ఎన్నుకుంది. అంత‌కుముందు వ‌ర‌కు పోలీసు కేసుల‌తో విసిగి వేసారిన‌.. ప్ర‌భాక‌ర్‌.. నేను మారిన మ‌నిషిని అని ప్ర‌క‌టించుకున్నారు. ఇక‌, ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే త‌న విధి అని చెప్పుకొచ్చారు. తాడిప‌త్రిని అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఏపీలో టీడీపీ అన్ని చోట్లా ఓడిపోయినా ఒక్క తాడిప‌త్రిలో మాత్ర‌మే గెల‌వ‌డంతో వారి క్రేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది.


కానీ, ఆయ‌న ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ పంథా మార్చుకున్నారు. త‌న పాత స్ట‌యిల్‌లోనే ముందుకు సాగుతున్నారు. స్థానికంగా కొంద‌రు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరిన‌ప్పుడు.. మీరు డ‌బ్బులు తీసుకుని ఓట్లు వేశార‌ని.. ఇప్పుడు అడిగే అర్హ‌త లేద‌ని.. మొహం మీదే చెప్పారు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య‌పై ఆయ‌న‌తో మాట్లాడాల‌ని అనుకున్నా.. అస‌లు.. ఆయ‌న అడ్ర‌స్ కూడా క‌నిపించ‌డం లేదు. పైగా.. త‌న మాటే చెల్లుబాటు కావాల‌ని భావిస్తున్నారు. దీంతో ఎవ‌రూ ఇప్పుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ పై సానుకూలంగా క‌నిపించ‌డం లేదు.


ఇక‌, ఇప్పుడు క‌రోనా ప్ర‌భావం పెరిగిన నేప‌థ్యంలో స్థానికంగా వైద్యం అందిస్తున్న ప్ర‌భుత్వ వైద్యుల‌పై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైద్యం స‌రిగా అందించ‌డం లేద‌ని.. ముఖ్యంగా త‌న అనుచ‌రుల‌కు వైద్యం అందించ‌డం లేద‌ని ఫైర‌య్యారు. ఇది జిల్లా వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై కొంద‌రు పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఓ కీల‌క స‌ల‌హాదారు సూచ‌న‌ల‌తో కేసు న‌మోదు కాలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. జేసీ దూకుడుకు మాత్రం మార్కులు ప‌డ‌క‌పోగా.. ఆయ‌న‌కు మైన‌స్ మార్కులు మ‌ళ్లీ ఎక్కువ‌య్యాయ‌నే ప్ర‌చారం మాత్రం జ‌రుగుతుండడం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: