వాళ్లంతా సెలబ్రెటీలు.. మరి సెలబ్రెటీ అంటే ఓ రేంజ్‌ మెయింటైన్ చేయాలి కదా.. ఖరీదైన బంగళాలు.. ఖరీదైన కార్లు.. ఆభరణాలు.. ఆ హంగులన్నీ ఉండాలి కదా.. అందుకే అతి ఖరీదైన కార్లు కొన్నారు. ఇప్పుడు అవే కార్లు వారి గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. మరి కార్లు కొంటే రైళ్లు పరుగెత్తడమేంటి అనుకుంటున్నారా.. అవును మరి.. వారు కార్లు కొన్నది రాజమార్గంలో కాదు.. దొడ్డి దారిలో. అవును.. టాక్స్ ఎగ్గొట్టేందుకు కొందరు చూపించిన అక్రమ మార్గంలో కార్లు కొన్న సెలబ్రెటీలు ఇప్పుడు భయంతో గజగజా వణికిపోతున్నారు.


విదేశాల నుంచి తెప్పించుకునే ఖరీదైన కార్లు కొనాలంటే చాలా ఖర్చవుతుంది. ఈ విలాసవంతమైన కార్లకు భారీగా పన్నులు కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నులు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా.. కారు విలువ కోటి రూపాయలు ఉంటే.. పన్నులు 2 కోట్లు ఉంటాయి. వామ్మో ఇంత పన్నా.. అనుకుంటున్నారు కదా.. ఈ సెలబ్రెటీలు కూడా అలాగే అనుకున్నారు. ఇలాంటి వారిని బుట్టలో వేసుకునేందుకు కొన్ని ముఠాలు ఉంటాయి. వాళ్లు దొడ్డి దారిన ఫారిన్ నుంచి కార్లు తెప్పిస్తామంటారు. ఎలాగంటే.. విదేశీ రాయబారులు వంటి వారికి పన్ను మినహాయింపులు ఉంటాయి. అలా ఆ రాయబారులతో కుమ్మక్కై వారి పేరు మీద కార్లు రప్పిస్తారు.


గుడ్‌గావ్‌లోని ఓ కార్ల అమ్మకాల సంస్థ సీఈవో లియాకత్‌ బచావ్‌ ఖాన్‌తోపాటు నిపుణ్‌ మిగ్లానీ, సురియా అర్జునన్‌ ఈ కార్ల స్కామ్‌కు  తెరతీశారు. ఇలా లేటేస్టుగా ఓ కారు వస్తుందని సమాచారం అందుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు వలపన్ని వారిని పట్టుకున్నారు. ఆ తరవాత వాళ్లను పట్టుకుని నాలుగు తగిలిస్తే.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇలా చాలా మందికి పన్ను ఎగ్గొట్టేలా కార్లు ఇప్పించామని చెప్పారు. ఇంకే ముందు ఇప్పుడు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆ సెలబ్రెటీలను పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారట.


ఇలా విదేశీ రాయబారుల పేరుతో తెచ్చుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం విచారణకు డీఆర్‌ఐ అధికారులు ‘ఆపరేషన్‌ మాంటె కార్లో అనే పేరు పెట్టారు. కొన్నేళ్లలో ముంబయి పోర్టుకు ఇలా 50 వరకూ కార్లు దిగుమతి అయ్యాయట. వాటిలో చాలా కార్లు హైదరాబాద్‌లోనే అమ్మారట. మరి ఈ స్కామ్‌లో ఎందరు సెలబ్రెటీలు బయటపడతారో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: