ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌ర్వాత అధికార పార్టీలో ఆ త‌ర‌హా అధికారాన్ని చెలాయిస్తున్న నేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది ఒక్క విజ‌య‌సాయిరెడ్డి అని చెప్ప‌వ‌చ్చు. అధికారం వ‌చ్చిన మొద‌ట్లో స‌ర్వం తానై చ‌క్రం తిప్పిన విజ‌య‌సాయిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల బాధ్యుడిగా నియ‌మించారు. ఆ త‌ర్వాతే విజ‌య‌సాయి విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌పై పూర్తిస్థాయి ప‌ట్టుసాధించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, స‌ర్వం తానే అయి చ‌క్రం తిప్పుతుండ‌టంతో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విజ‌సాయిని దూరం పెడుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

విజ‌య‌సాయి చెప్పిందే శాస‌నం?
ఏపీ ఆర్థిక రాజ‌ధాని విశాఖ‌ప‌ట్నంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి చెప్పిందే శాస‌నం అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న జ‌న్మ‌దిన వేడుక‌ల స‌మ‌యంలో న‌గ‌రంలో య‌థేచ్ఛ‌గా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని, ఇలా అయితే భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో ఈ మూడు జిల్లాల్లో పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే తీయించేసింది. విజ‌య‌సాయి విశాఖ‌లో సొంత వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నార‌ని, అధికారులెవ‌రూ త‌మ మాట విన‌డంలేద‌ని ప్ర‌జాప్ర‌తినిధులంతా వాపోతున్నారు. ఉద్యోగులు, అధికారుల బ‌దిలీలు కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయ‌ని, ఆయ‌న హ‌వాను త‌గ్గించాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మా సాధార‌ణ కార్య‌క‌లాపాలు కూడా ఆయ‌న త‌న అనుచ‌రుల‌ద్వారా తెలుసుకొని ప్ర‌శ్నిస్తుండ‌టంతో త‌మ‌పై ఒత్తిడి పెరిగిపోతోంద‌ని, ఏ ప‌నిచేయాలన్నా ఒక‌టికిరెండుసార్లు ఆలోచించుకోవాల్సి వ‌స్తోందని చెప్పిన‌ట్లు పార్టీవ‌ర్గాలంటున్నాయి. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా విజ‌య‌సాయి అధికారాల‌కు క‌త్తెర వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న ప‌రిధిని కూడా కుదించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

tag