తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరడంతో.. కేంద్ర జల్‌ శక్తి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా ట్రైబ్యునల్‌ కాల పరిమితిని మరో ఏడాది పెంచుతున్నట్లు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జల వివాదాల చట్టం-195లోని సెక్షన్ల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలను అనుసరించి.. కృష్ణా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని ఆగస్టు 1, 2021 నుంచి జులై 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

కృష్ణా ట్రైబ్యునల్‌ను గత యూపీఏ ప్రభుత్వం 2004 ఏప్రిల్‌ 2న ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసమే ఈ ట్రైబ్యునల్‌ను కేంద్‌రం ఏర్పాటు చేసింది. ఆరేళ్ల పాటు 3 రాష్ట్రాల్లో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత... డిసెంబర్‌ 30, 2010న నివేదికను కేంద్రానికి ట్రైబ్యునల్‌ సమర్పించింది. అయితే నాటి నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ .. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు .. మార్చి 29, 2011న మళ్లీ దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. అయితే దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రిబ్యునల్‌ కాలపరిమితిని పొడిగిస్తూ వస్తోంది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత...  విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పెంచింది. దీనికి కొత్తగా  విధివిధానాలను కూడా ఖరారు చేయాలని కేంద్రం సూచించింది. జులై 23, 2020న కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన ఉత్తర్వుల్లోని విధివిధానాల ప్రకారం ఆగస్టు 1, 2021 లోపు ట్రైబ్యునల్‌ తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే ఇందుకు తమకు మరో ఏడాది సమయం కావాలని కృష్ణా ట్రైబ్యునల్‌ విజ్ఞప్తి చేయడంతో ... కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్న డిమాండ్. కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకే కృష్ణా జలాల పంపిణీ కాకుండా అన్ని రాష్ట్రాలకూ పునఃపంపిణీ చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇప్పటి వరకు ఏం తేల్చలేదు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడకముందే కేంద్రం ట్రైబ్యునల్‌ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: