కరోనా భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్‌ ఏదోలా సోకుతూనే ఉంది. అయితే కేవలం 15 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందితే... వైరస్‌ తగ్గిపోతుందనేది వైద్యుల సూచన. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబ పరిస్థితిని చూసి... ఆ గ్రామం వారంతా బాబోయ్‌.. ఇదేం జాగ్రత్త అని ఆశ్చర్యపోతున్నారు. కొవిడ్‌ సోకుతుందనే భయంతో జిల్లాలోని రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఏకంగా 15 నెలలుగా ఇంట్లోనే ఉండిపోయింది.


వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ... ఇదే వాస్తవం. ఏకంగా 15 నెలల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఆ కుటుంబంలో ఇద్దరు మగవాళ్లు మాత్రం రోజులో కొద్దిసేపు బయటకు వచ్చి.... చిన్నచిన్న పనులు చేసుకుని... ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుని మళ్లీ ఇంట్లోకి  వెళ్లిపోయేవారు. కానీ అదే ఇంట్లో ఉంటున్న మిగిలిన ముగ్గురు మహిళలు మాత్రం బయటకు రాకుండా 15 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.


గమళ్లపాలెంకాలనీకి చెందిన చుట్టుగుళ్ల బెన్ని కుటుంబసభ్యులు కరోనా హెచ్చరికలతో బెంబేలెత్తిపోయారు. బెన్నికి వచ్చే దివ్యాంగ పింఛన్‌తో పాటు నెలనెలా వచ్చే రేషన్ సరుకులతోనే ఆ కుటుంబం 15 నెలల పాటు గడిపింది. అయితే ఇటీవల వారికి ప్రభుత్వం ఓ ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది. ఈ విషయంపై ఇంటికి వెళ్లిన పంచాయతీ సిబ్బందికి షాకింగ్ విషయం తెలిసింది. బెన్ని భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా 15 నెలలుగా బయటకు రాలేదని గుర్తించారు. ఇంటి స్థలం కోసం బయోమెట్రిక్ వేలిముద్ర వేయాలని బెన్ని భార్య రూతమ్మ నుంచి విచిత్రమైన సమాధానం వచ్చింది.


ఇంటిస్థలం వద్దు.. ఏం వద్దు.. ఇంటి నుంచి బయటకు వచ్చేది లేదు... మీరు వెళ్లిపోండి అంటూ సిబ్బందికి సమాధానం చెప్పింది రూతమ్మ. అయితే అప్పటికే వాళ్ల ఆరోగ్య పరిస్థితి క్షిణించడం గమనించిన గ్రామ సర్పంచ్‌ పోలీసుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 15 నెలలుగా ఇంట్లోనే ఉండటంతో.... వారికి సరైన పోషకాహారం లేక ముగ్గురు మహిళలు అనారోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. అలాగే ఎవరితో మాట్లాడకపోవడం వల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని రాజోలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: