నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లు జగన్‌రెడ్డి సొంత వర్గానికా అని టెక్క‌లి ఎమ్మెల్యే కింజ‌వ‌ర‌పు అచ్చెన్నాయుడు వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. వైసీపీలోని రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం కోస‌మే సీఎం జ‌గ‌న్ తాప‌త్ర‌య ప‌డుతున్నాడ‌ని ఆరోపించారు. కుర్చీలు లేని ఛైర్మన్‌లు బలహీనవర్గాలకా..? అంటూ ప్ర‌శ్నించారు. విద్యావంతులైన నిరుద్యోగులను ప‌ట్టించుకోకుండా త‌న పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల‌కు మాత్ర‌మే ప‌ద‌వులు క‌ల్పిస్తున్నాడ‌ని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలోని
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల్ని డమ్మీలిగా మార్చేశార‌ని వారు పేరుకే మంత్రుల‌న్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ.. వివక్ష చూపించారని తెలిపారు.


నిధులు, అధికారాలు ఉన్న పదవుల్ని సొంత వారికి కట్టబెట్టార‌ని, బడుగు బలహీన వర్గాలకు కనీసం కుర్చీ కూడా లేని ఛైర్మన్ పదవుల్ని కేటాయించారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో సింహభాగం ముఖ్యమంత్రి సామజిక వర్గంతో నింపుకున్నార‌ని విమ‌ర్శించారు. బీసీలు పోటీలో పాల్గొన‌కుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని గుర్తు చేశారు. నిమ్న వ‌ర్గాల కోసం ఏర్పాటు చేసిన‌ సబ్ ప్లాన్ నిధుల్లో కోత పెట్టార‌ని తెలిపారు. ఇళ్ల పట్టాల పేరుతో 10వేల ఎకరాల  అసైన్డ్‌ భూముల్ని బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల నుంచి లాక్క‌న్నార‌ని ఆరోపించారు.



ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చెబుతూ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌ను మోసం చేస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్లు కోల్పోతున్నార‌ని అచ్చెన్నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాడులు, అత్యాచారాలు, హత్యలతో తెగబడుతూ.. బడుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా చేశార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. బ‌డుగు, బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా ప్ర‌భుత్వం అధికారం చెలాయిస్తుందోని మండిప‌డ్డారు.

  గ‌తంలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగు దేశం పార్టీ హయాంలో..  కీలక పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన‌ట్టు గుర్తు చేశారు.  అదే ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మాత్రం ఉన్నత పదవులన్నింటినీ త‌న సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారని అచ్చెన్నాయుడు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp