భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళుతున్నారు. మూడు రోజులు ఢిల్లీలో ఉండి పార్టీ పెద్దలతో ఏపీ ప‌రిస్థితిపై చర్చలు జరపనున్నారు. మూడురోజ‌లుండేలా రావాలంటూ పెద్దల నుంచి సమాచారం అంద‌డంతో  సోము వీర్రాజుతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళుతున్న సోము పార్టీ అధ్య‌క్షుడిగానే తిరిగొస్తారా?  లేదంటే ప‌ద‌వి ఊడ‌గొట్టుకొని తిరిగొస్తారా? అనే చ‌ర్చ‌లు ఇప్పుడు ఏపీ బీజేపీలో ప్రారంభ‌మైంది.

మాన‌సికంగా సంసిద్ధుల‌ను చేయ‌డం!
సోము వీర్రాజును మాన‌సికంగా సంసిద్ధం చేసేందుకే మూడురోజులుండేలా ర‌మ్మ‌ని వ‌ర్త‌మానం పంపివుంటార‌ని, పార్టీప‌రంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌డం. ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డం, దానికి అనుస‌రించాల్సిన వ్యూహాల్లాంటివి ఢిల్లీ పెద్ద‌లు అమ‌లు చేయ‌బోతున్నారు. బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాలు చూస్తోన్న ఆర్ ఎస్ ఎస్ ఇన్‌చార్జిని ఇప్ప‌టికే పార్టీ మార్చింది. గ‌తంలో స‌తీష్‌జీ చూసే వ్య‌వ‌హారాల‌ను ఇప్పుడు శివ‌ప్ర‌కాష్ అనే వ్య‌క్తి చూస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ప‌లు స‌మావేశాల‌ను కూడా నిర్వ‌హించారు. ఎన్ని స‌మావేశాలు పెడుతున్న‌ప్ప‌టికీ పార్టీ నేత‌ల తీరులో మార్పురాక‌పోతుండ‌టంతో ఆయ‌న కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలియ‌వ‌స్తోంది. అస‌లు దీనికి కార‌ణం ఏమిటి? ఏపీలో నేత‌లంతా ఇలానే ఉంటారా?  పార్టీని బ‌లోపేతం చేయాలంటే క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న ఢిల్లీ పెద్ద‌ల‌కు స‌మాచారం పంపించిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్ ఎస్ ఎస్ త‌ర‌ఫున కీల‌క‌మైన నివేదిక‌
ఆర్ ఎస్ ఎస్ త‌ర‌ఫున కీల‌క‌మైన నివేదిక ఢిల్లీకి అందింద‌ని, ఆ నివేదిక ప్ర‌కారం సోమును మార్చే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఏపీలో పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే కీల‌క‌మైన మార్పులు చేయాల్సిందేన‌ని, అందులో భాగంగానే సోమ‌ను ఢిల్లీకి పిలిపించారంటున్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా త‌యారైంద‌ని, ఎద‌గుద‌ల సంగ‌తి దేవుడెరుగు పూర్తిగా నిర్వీర్య‌మ‌య్యే స్థితికి చేరుకుంద‌ని ఆర్ ఎస్ ఎస్ పెద్ద‌లు, బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌న‌సేన‌ను క‌లుపుకోకుండా వెళ్ల‌డం, అధికార పార్టీతో అంట‌కాగుతుండ‌టంటాంటివ‌న్నీ ఇప్ప‌టికే పార్టీపెద్ద‌లకే చేరాయ‌ని, రాష్ట్రంలో క‌మ‌లాన్ని రెప‌రెప‌లాడించాలంటే సోమ‌ను త‌ప్పించ‌డం మిన‌హా వేరే ప్ర‌త్యామ్నాయం లేద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ మూడురోజుల్లో ఏం తేలుతుందో వేచిచూద్దాం..!!




మరింత సమాచారం తెలుసుకోండి:

tag