దేశంలో కొన్ని సంస్కరణలు చేపట్టాలని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. భారత్ ని అమెరికా మోడల్ గా మార్చాలని కూడా కేంద్ర పెద్దలు తలపొస్తున్నారు అన్న మాట కూడా ఉంది. ఈ దేశం జనాభా 140 కోట్లుగా ఉంది అన్నది లెక్కలు చెబుతున్నారు. అదే అమెరికా 35 కోట్లు దాకా ఉంటుంది. అంటే నాలుగవ వంతు లేని అమెరికా జనాభాతో భారత్ ని సరిపోల్చగలమా అంటే కుదిరేది కాదు.

కానీ అక్కడ విధానాలను ఇక్కడ అమలు చేయాలన్న తాపత్రయం మాత్రం కనిపిస్తోంది. అమెరికా వంటి చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ప్రభుత్వ రంగ సంస్థలు అంతకంటే ఉండవు. అదే భారత్ వంటి దేశాలు మిశ్రమ ఆర్ధిక వ్యవస్థను నమ్ముకుని దశాబ్దాల తరబడి సాగుతున్నాయి. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా కూడా ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. అలా రెండూ పోటీ పడడం వల్ల దేశ ఆర్ధిక అభివృద్ధి సాధ్యమని మొదటి తరం నేతలు నమ్మారు.

అయితే ఇపుడు మాత్రం ప్రభుత్వ రంగం ఉండదన్న భావన బలపడుతోంది. కేంద్రం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవాలని చూస్తోంది. తాము వ్యాపారం చేయడానికి లేమని కూడా స్పష్టం చేస్తోంది. ఇలా కేంద్రం తలచుకోగానే గుర్తుకువచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్, 2015 తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంది. అయితే మళ్లీ కోలుకుని ముందుకు సాగగలదు. కానీ కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసి తీరుతామని కచ్చితంగా చెప్పేస్తోంది. దీంతో ఇపుడు ఉక్కు కార్మిక లోకం తల్లడిల్లుతోంది.

కేంద్రం విశాఖ ఉక్కునే ఎందుకు ప్రైవేటీకరించాలి. ఒడిషాలోని వాటి జోలికి ఎందుకు పోదు, దేశంలో మరిన్ని ఉక్కు కర్మాగారాలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇదొక్కటే కాదు, ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఎలా ఉంటుంది అన్న దానికీ కూడా ఏపీ అచ్చమైన ఉదాహరణ. ప్రత్యేక హోదా, విభజన హామీలు అలా మూలకు పోయాయి. మరి ఏపీ ఇలా అన్ని కష్టాలకు, నష్టాలకు ఒక ప్రయోగశాలగా మారుతోందా అన్న చర్చ అయితే అందరిలో వస్తోంది మరి. దానికి బలహీనమైన రాజకీయ నాయకత్వాలు ఏపీలో ఉండడమే అన్నది నిష్టుర సత్యం. మరి మిగిలిన చోట్ల ఇలా చేయగలరా అన్న దానికి కూడా ఇదే సమాధానం అనుకోవాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: