రాయలసీమకు రతనాల సీమ అని పేరు ఉంది. అక్కడ రోడ్డు మీద పోసి ఒకనాడు రతనాలు అమ్మేవారు. రాయలు ఏలిన సీమ అది. అటువంటి రాయలసీమ ఇపుడు దురవస్థనే ఎదుర్కొంటోంది. అంతే కాదు, విభజన తరువాత సీమ కష్టాలు సీత కష్టాలే అయ్యాయని అన్న వారూ ఉన్నారు.

తాజాగా క్రిష్ణా నీటి మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాస్తా కేంద్రం పెత్తనానికి దారితీసింది. ఎగువ రాష్ట్రంతో ఎపుడూ నీటి గొడవలు ఉంటాయి. అయితే సయోధ్య ద్వారా వాటిని పరిష్కరించుకునే  వీలు ఉంది. కానీ ఇపుడు కేంద్రం ఏకంగా వీటిని ఆసరాగా చేసుకుని పెత్తనం చేయడానికి సిద్ధం కావడంతో అటు తెలంగాణాతో పాటు, ఇటు రాయలసీమ కూడా అన్యాయం అయిపోతాయి అంటున్నారు.

అనుమతులు లేని ప్రాజెక్టులకు చుక్క నీరు దక్కదు. అదే సమయంలో చుక్క నీరు అదనంగా దక్కదు. మరో వైపు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఏడాదికి చెరి రెండు వందల కోట్లు గోదావరి, క్రిష్ణా బోర్డుల నిర్వహణకు ఇచ్చి మరీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తాయి. దాంతో  కేంద్రం  తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పట్ల రాయలసీమ రగిలిపోతోంది. తమకు దీని వల్ల చాలా నష్టం వస్తుందని సీమ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి గర్జిస్తున్నారు. ఆయన 1980 దశకంలో వైఎస్సార్ తో కలసి సీమ నీటి కష్టాల మీద ఉద్యమించిన నాయకుడు.

ఆయన గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాయలసీమను పూర్తిగా ఎడారి చేస్తారా అంటూ మండిపడడం చూస్తూంటే సీమవాసుల భావన కూడా ఇదేనా అన్న ఆలోచనలు కలుగుతునాయి. ఇక రాయలసీమకు ఒక ప్రభుత్వం ఉంటే ఇలాంటి అన్యాయం జరిగేదా అంటూ ఆయన గ్రేటర్ రాయలసీమ డిమాండ్ కూడా ముందుకు తెచ్చారు. నిజంగా ఇది సహేతుకమా కాదా అన్నది పక్కన పెడితే తెలంగాణా ఆవిర్భావానికి కూడా నీళ్ళు, నిధులు, ఉపాధి వంటివే కారణం అయ్యాయని మరువరాదు. మొత్తానికి ఆయన అంటున్న మాటలు చూస్తూంటే సీమ ఇపుడు మండుతోంది అనే చెప్పాలి. ఇప్పటికైనా ఏపీ సర్కార్ కేంద్రంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ మీద సవరణలు కోరాలి. లేకపోతే మాత్రం సీమ నష్టం తప్పదు, అది వైసీపీకి కూడా రాజకీయ నష్టాన్నే చేకూరుస్తుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: