విడదల రజిని....అధికార వైసీపీలో మంచి క్రేజ్ ఉన్న ఎమ్మెల్యే. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి, సీనియర్ నాయకుడుని ఓడించి, ఎమ్మెల్యేగా గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మామూలుగా చిలకలూరిపేటలో టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించడం వైసీపీకి అసాధ్యమని గత ఎన్నికల్లో ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి టికెట్ దక్కించుకుని, జగన్ వేవ్‌లో రజిని, పేట బరిలో విజయం సాధించారు.

అయితే రజిని విజయానికి ప్రధాన కారణం జగన్ వేవ్, ప్రత్తిపాటి మీద ఉన్న వ్యతిరేకిత అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ సపోర్ట్ అని విశ్లేషకులు గట్టిగానే చెబుతారు. అలా ఎమ్మెల్యేగా గెలిచిన రజిని దూకుడుగా నియోజకవర్గంలో పనిచేస్తూ ముందుకెళుతున్నారు. తక్కువ సమయంలోనే  నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇలా మంచి క్రేజ్ ఉన్న రజినికి ఇక చిలకలూరిపేటలో తిరుగులేదని, ఆమె అనుచరులు, అభిమానులు భావిస్తున్నారు.

కానీ ఇక్కడ ప్రత్తిపాటిని తక్కువ అంచనా వేయొద్దని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎందుకంటే పేటలో ప్రత్తిపాటికి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఓడిపోయినా సరే పేట ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు. అలాగే టీడీపీలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు పెద్దగా జరగడం లేదనే వాదన ఉంది. ఇక సొంత పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్‌ వర్గాన్ని పక్కనబెట్టడం రజినికి మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కమ్మ వర్గానికి చెందిన మర్రికి నియోజకవర్గంలో ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ గత ఎన్నికల్లో రజిని విజయానికి కృషి చేసిందని, కానీ  ఈసారి ఆ పరిస్తితి ఉండకపోవచ్చని అంటున్నారు. గతంలో రజినికి మద్ధతు ఇచ్చిన కొందరు కమ్మ ఓటర్లు, ఈసారి ప్రత్తిపాటికి సపోర్ట్ ఇచ్చేలా ఉన్నారు. అలాగే ఈ సారి జగన్ వేవ్ కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని చెబుతున్నారు. ఈ అంశాలు రజినికి షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని, అదే ప్రత్తిపాటికి కలిసొస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: