వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు పొత్తు పెట్టుకుంటారా? అంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే చంద్రబాబుకు కలిసొచ్చిందని, పవన్ చెప్పడం వల్లే మెజారిటీ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం వల్ల చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేస్తున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం కూడా పవన్-చంద్రబాబులు విడివిడిగా పోటీ చేయడమనే చెబుతున్నారు. ఒకవేళ ఆ ఎన్నికల్లోనే టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుని బరిలో దిగితే వైసీపీకి ఆ స్థాయి విజయం దక్కేది కాదని, అధికారం రాకపోయినా సరే టీడీపీ-జనసేనలకు సీట్లు బాగానే వచ్చేవని, పవన్ సైతం రెండుచోట్ల గెలిచేవారని అంటున్నారు. అప్పుడు కలిసి పోటీ చేయకపోవడం వల్ల టీడీపీ-జనసేనల మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీకి భారీగా సీట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ సారి రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అనేక విశ్లేషణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే పవన్ కల్యాణ్, చంద్రబాబు కోసం రాజకీయంగా ఓ త్యాగం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అది ఏంటంటే పవన్ 175 నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకులని పెట్టలేదని, ఏదో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అంటే పవన్ రాష్ట్ర స్థాయిలో జనసేనని బలోపేతం చేయట్లేదు. అలాగే పూర్తి స్థాయిలో ఇన్‌చార్జ్‌లని కూడా పెట్టడం లేదు.

దీని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ పొత్తు పెట్టుకోవడం ఖాయమని, అందుకే చాలాచోట్ల జనసేనకు ఇన్‌చార్జ్‌లు లేరని, ఒకవేళ నాయకులని పెడితే, ఆ సీట్లు టీడీపీకి వెళితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో పవన్ ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. పొత్తు నేపథ్యంలోనే చంద్రబాబు కోసం పవన్, జనసేన నాయకులని బలోపేతం చేయట్లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: